Telugu Astrology: వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఉజ్వల భవిష్యత్తు
ఈ నెల 14న సూర్యుడు మేషం నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారు ఉద్యోగ, ఆర్థిక లాభాలను పొందుతారు. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. తండ్రి నుంచి సహాయం లభిస్తుంది. సూర్య స్తోత్రం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

Telugu Astrology
ఈ నెల 14న రవి గ్రహం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. ఆ రాశిలో నెల రోజుల పాటు సంచారం చేసే రవి వల్ల కొన్ని రాశులు ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి, ఆస్తి సమస్యలు పరిష్కరించుకోవడానికి, తండ్రి నుంచి సహాయ సహకారాలు పొందడానికి, ప్రభుత్వం వల్ల లబ్ది పొందడానికి బాగా అవకాశం ఉంది. రవి వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కలగాలన్న పక్షంలో ఆదిత్య హృదయాన్ని గానీ, సూర్య స్తోత్రాన్ని గానీ పఠించడం మంచిది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారు బాగా లబ్ది పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం, ఆర్థిక లాభాలు కలగడం, ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. మీ సలహాలు, సూచనల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా లబ్ధి పొందుతాయి.
- వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన రవి ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. మాతృమూలక ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో ముందుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలోకి ధనాధిపతి రవి ప్రవేశం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా కలిసి వస్తాయి. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులే కాక, బందుమిత్రులు సైతం లబ్ది పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి లభిస్తుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగి, సాన్నిహిత్యం, సామరస్యం వృద్ది చెందుతాయి. భారీగా వస్త్రాభరణాలను కొనడం జరుగుతుంది.
- సింహం: రాశ్యధిపతి రవి దశమ స్థానంలోకి ప్రవేశించినందువల్ల కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభి స్తుంది. ఇతర ఉద్యోగులకు పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి వల్ల సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ యోగ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు కలిగే మంచి పనులు చేపడతారు.
- వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, కష్టనష్టాలు బాగా తగ్గిపోవడం జరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పనులు, ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.



