Parivartan Yoga: ఆ రాశుల వారికి అరుదైన యోగం.. వారు ఇల్లు, స్థలాలు లేదా పొలాలు కొనడం ఖాయం..

| Edited By: Janardhan Veluru

Apr 10, 2023 | 1:53 PM

ఈ నెల అంతా కుజ, బుధ గ్రహాల మధ్య ఒక మంచి పరివర్తన యోగం జరుగుతోంది. అంటే కుజుడి స్వస్థానమైన మేషరాశిలో బుధుడు, బుధుడికి స్వక్షేత్రమైన మిధునంలో కుజుడు సంచరించడం ఆరు రాశుల వారికి విశేషంగా యోగించబోతోంది.

Parivartan Yoga: ఆ రాశుల వారికి అరుదైన యోగం.. వారు ఇల్లు, స్థలాలు లేదా పొలాలు కొనడం ఖాయం..
Astrology
Follow us on

ఈ నెల అంతా కుజ, బుధ గ్రహాల మధ్య ఒక మంచి పరివర్తన యోగం జరుగుతోంది. అంటే కుజుడి స్వస్థానమైన మేషరాశిలో బుధుడు, బుధుడికి స్వక్షేత్రమైన మిధునంలో కుజుడు సంచరించడం ఆరు రాశుల వారికి విశేషంగా యోగించబోతోంది. కుజుడు ప్రధానంగా టెక్నికల్, టెక్నాలజికల్, ఇంజనీరింగ్, సైన్స్, మ్యాత్స్ వంటి అంశాలకు కారకుడు. కాగా, బుధుడు ప్రతిభా పాటవాలకు, తెలివితేటలకు, సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు కారకుడు. ఈ రెండు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగటం ఒక అరుదైన యోగం. దీనివల్ల మేషం, మిధునం, సింహం, తుల, ధనస్సు, మీన రాశుల వారు విశేషంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఈ పరివర్తన మే నెల పదవ తేదీ వరకు కొనసాగుతుంది.

  1. మేష రాశి: మేషరాశిలో ఉన్న బుధుడు, మిధున రాశిలో ఉన్న కుజుడితో పరివర్తన చెందటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల రోజుల కాలంలో ఎక్కువగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా ఈ రాశి వారు ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి చెందటం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ఎంతగానో లబ్ధి పొందుతారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. పలుకుబడి గల వ్యక్తులు పరిచయం అవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పట్టుదల ధైర్యం సాహసం వంటి లక్షణాలు పెరిగి, కొన్ని ప్రధానమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాక చాలాకాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.
  2. మిథున రాశి: ఈ రాశి వారికి 11వ స్థానంతో పరివర్తన జరగటం వల్ల ఉద్యోగంలోను, వృత్తిలోనూ ముందుకు దూసుకుపోవడం తప్పకుండా జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. విహార యాత్రలు, వినోద యాత్రలు చేయటానికి అవకాశం ఉంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతరులకు మేలు జరిగే పనులు చేయడం, బంధుమిత్రులకు సహాయం చేయడం వంటివి చోటు చేసుకుంటాయి. కుటుంబ వృద్ధి ఉంటుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.
  3. సింహ రాశి: ఈ రాశి వారికి భాగ్య లాభ స్థానాల మధ్య పరివర్తన జరగటం ఒక విశేషమైన అదృష్టంగా చెప్పవచ్చు. వీరి ప్రయత్నాలు, వీరి ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది. వీరి మనసులోని కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలే కాకుండా కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవు తాయి. జీవితానికి సంబంధించి సరైన ప్రణాళి కను తయారు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది.
  4. తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ భాగ్య స్థానాల మధ్య పరివర్తన జరగటం చాలా మంచిది. మంచి సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి మంచి ఉద్యోగంలో చేరటానికి అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాముల వల్ల ఆశించిన పురోగతి చోటు చేసుకుంటుంది. భాగస్వాములతో వివాదాలు, విభేదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశాలలో చదువులు, ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎన్నడూ లేనంతగా మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం లేదా దాంపత్య జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు, స్థలాలు, పొలాల విలువ బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి లేదా స్వయంగా వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు రాశి: ఈ రాశి వారికి పంచమ, సప్తమ రాశుల మధ్య పరివర్తన జరిగింది. దీనివల్ల వీరి ఆలోచనలకు, వీరి మాటకు విలువ పెరుగుతుంది. వీరి సలహా లను సూచనలను చాలామంది అనుసరించటం జరుగుతుంది. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా చలామణి అయ్యే అవకాశం ఉంది. వీరిలోని ప్రతిభాపాటవాలకు శక్తి సామర్థ్యాలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానయోగం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు పెళ్లి దాకా వెళతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. విదేశాలలో స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్న వారు సఫలం అవుతారు. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు.
  7. మీన రాశి: ఈ రాశి వారికి ధన సుఖస్థానాల మధ్య పరివర్తన జరగటం చాలా మంచి పరిణామం. ఇల్లు, స్థలాలు లేదా పొలాలు కొనటం జరుగుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి లాభాల వర్షం కురిపిస్తాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మొండి బాకీలన్నీ వసూలు అవుతాయి. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. వాగ్దానాలను లేదా హామీలను నిలబెట్టుకుం టారు. కుటుంబ వృద్ధికి అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సాహస కృత్యాలతో వార్తలకు ఎక్కుతారు. రచనా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులను విజయాలు వరిస్తాయి. బంధుమిత్రులకు మితిమీరిన  ఔదార్యంతో అనేక విషయాలలో సహాయం చేస్తారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..