Telugu Astrology: బలమైన రాశినాథుడితో ఈ రాశులకు కొత్త దశ! జీవితం సాఫీగా, హ్యాపీగా..
జ్యోతిష శాస్త్రం ప్రకారం లగ్నాధిపతి బలంగా ఉంటే జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం వల్ల మేషం, వృషభం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి అద్భుత యోగాలు పట్టే అవకాశముంది. ఈ రాశుల వారు పదోన్నతులు, ఆర్థిక వృద్ధి, ఆస్తి లాభాలు, ఆరోగ్యంతో పాటు సంపద, సంతోషాలతో కూడిన వైభవమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఇది వారికి అదృష్ట సమయం కాబోతుంది.

Lagnapathi Positive Impacts
జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో లగ్నాధిపతి లేదా రాశ్యధిఫతి అనుకూల స్థానాల్లో బలంగా ఉండే పక్షంలో జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఎన్ని కష్టనష్టాలనైనా అధిగమించగలుగుతారు. లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి ఎక్కడ ఉన్నాడన్న దాని మీదే వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ అధిపతి బలంగా, సరైన స్థానంలో ఉన్న పక్షంలో చిన్న యోగమైనా అద్భుత ఫలితాలనిస్తుంది. అందువల్ల లగ్నాధిపతి, రాశ్యధిపతి అన్నిటికన్నా ముఖ్యం. ప్రస్తుతం గ్రహ సంచారంలో రాశ్యధిపతి స్థితిని బట్టి మేషం, వృషభం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాలు బ్రహ్మాండంగా, వైభవంగా సాగిపోయే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలో ప్రవేశించబోతున్నందువల్ల ఈ నెల 28 నుంచి రెండు నెలల పాటు ఈ రాశివారి జీవితం అత్యంత యోగదాయ కంగా పురోగతి చెందబోతోంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు వృద్ది చెందుతాయి.
- వృషభం: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల నెల రోజుల పాటు వీరి జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి లాభం, ఆరోగ్య లాభం కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. శుభ కార్యాలు జరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయానికి లోటుండదు.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల నెల రోజుల పాటు వీరి జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతుంది. ఆర్థికపరంగా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజ గ్రహం ఇదే రాశిలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల డిసెంబర్ వరకు వీరి జీవితం వైభవంగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది.
- ధనుస్సు: రాశ్యదిపతి గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందువల్ల డిసెంబర్ వరకు వీరి జీవితం రాజయోగంగా సాగిపోతుంది. ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వీరి ఆలోచనలు, ప్రయత్నాలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది.
- మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం, సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ రాశివారి సంపద పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు లభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో అంద లాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగవుతుంది.



