Property Astrology: ఈ ఏడాది చివరిలోగా..ఈ రాశుల వారికి ఆస్తిపాస్తులు గ్యారెంటీ..!
Guru-Kuja Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువు కర్కాటకంలో, కుజుడు వృశ్చికంలో ఉండటంతో 6 రాశుల వారికి ఈ ఏడాది చివరికల్లా స్థిరాస్తులు చేకూరనున్నాయి. వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీనం రాశుల వారికి గృహ, భూమి, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై, వారసత్వ సంపద లభించే అవకాశాలున్నాయి.

Wealth And Property
Wealth and Property Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, కుజులు అనుకూలంగా ఉన్న రాశుల వారు తప్పకుండా ఆస్తి పాస్తులు సమకూర్చుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం గురువు తనకు ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలోనూ, కుజుడు తన స్వస్థానమైన వృశ్చికం రాశిలోనూ సంచారం చేస్తున్నాయి. ఈ రెండు గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న రాశుల వారు ఈ ఏడాది చివరి లోగా తప్పకుండా స్థిరాస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవడం, సరైన ప్రదేశంలో స్థలం కొనుక్కోవడం, ఆస్తిపాస్తులు సంక్రమించడం, వారసత్వ సంపద లభించడం వంటి పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆ ఆరు రాశులు – వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీనం.
- వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో లాభాధిపతి గురువు ఉచ్ఛపట్టడం, సప్తమ స్థానంలో కుజుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం కూడా పడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి అనుకోకుండా ఆస్తి లభించే అవకాశం కూడా ఉంది. స్థిరాస్తుల క్రయ విక్రయాల వల్ల ఈ రాశివారు బాగా ధనం సంపాదించే సూచనలున్నాయి.
- సింహం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉచ్ఛ గురువు, చతుర్థ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందు వల్ల స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. సొంత ఇంటి ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వాహన యోగం కూడా పడుతుంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలున్నాయి.
- తుల: ఈ రాశికి ధన స్థానంలో కుజుడు, దశమ స్థానంలో ఉచ్ఛ గురువు ఉన్నందువల్ల తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. ప్రభుత్వం ద్వారా గానీ, పనిచేస్తున్న సంస్థ ద్వారా గానీ గృహ యోగం లేదా స్థల యోగం పట్టే అవకాశం ఉంది. తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. కొద్ది కాలంలో స్థిరాస్తులు సమకూరుతాయి. అనుకోకుండా తల్లి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి. గృహ, వాహనాల కొనుగోలుకు ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.
- వృశ్చికం: రాశ్యధిపతి, భూ కారకుడు అయిన కుజుడు వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తుండడం, దాన్ని భాగ్య స్థానం నుంచి ఉచ్ఛ గురువు వీక్షించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆకస్మిక గృహ లాభానికి, ఆస్తి లాభానికి అవకాశం ఉంది. ఒకటి రెండు నెలల్లో గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవడానికి సమయం అనుకూలంగా ఉంది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు, లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. అతిత్వరలో ఇల్లు గానీ, ఫ్లాట్ గానీ, స్థలం గానీ అమరే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా గృహ సౌకర్యం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. తల్లితండ్రుల వైపు నుంచి వారసత్వంగా రావలసిన ఆస్తి, సంపద కొద్ది ప్రయత్నంతో తప్పకుండా చేతికి అందుతాయి.
- మీనం: ఈ రాశివారికి రాశ్యదిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి కుజ సంచారం వల్ల ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి బాగా అవకాశం ఉంది. ఇదివరకు కొన్న ఇల్లు, స్థలాలు, పొలాల విలువ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. తప్పకుండా గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి వస్తుంది. పిత్రార్జితం, వారసత్వ సంపద లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆస్తిపాస్తులు పెరిగే సూచనలున్నాయి.



