AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. సొంత జిల్లా నుంచి ప్రక్షాళన షురూ..!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడ నష్టపోకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది .

YCP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. సొంత జిల్లా నుంచి ప్రక్షాళన షురూ..!
Ys Jagan
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Aug 22, 2024 | 4:46 PM

Share

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడ నష్టపోకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. ముందుగా సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిలో జగన్ ఉన్నారు. అందుకే సొంత జిల్లాల నుంచే ప్రక్షాళన షురూ చేశారు. ముందుగా కడప, అన్నమయ్య జిల్లాల ఇంచార్జ్‌లను మార్చి తనదైన శైలిలో రాజకీయాలను మొదలుపెట్టారు. మొదట సొంత జిల్లాను చక్కదిద్దుకోగలిగితే, రాష్ట్రంలోని మిగిలిన క్యాడర్ అంతా చక్కదిద్దుకుంటుందని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది.

ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ కోటకు బీటలు బారాయి.. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలలో మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. ఇంతవరకు ఇలాంటి పరాభవాన్ని ఎప్పుడూ చెవిచూడలేదు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా, వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ పెట్టిన వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే రెండు దఫాలుగా తమ సత్తాను చాటి, కడప జిల్లాలో తమకు ఎదురు లేదు అంటూ నిలిచిన వైసీపీ నేతలు ఈసారి చతికిలాపడక తప్పలేదు.

ఎన్డీయే కూటమి హవాకు వైసీపీ తోక ముడిచింది. కేవలం మూడు అంటే మూడు సీట్లు మాత్రమే గెలుచుకొని తమ పట్టును కోల్పోయింది. అందుకే జగన్ పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ముందుగా నేతలలో ధైర్యాన్ని నింపే పనిలో పడ్డారు. దానికోసం జిల్లాలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆగస్ట్ 21వ తేదీన జిల్లాలోని ముఖ్య నేతలు కార్యకర్తలకు ఫోన్లు చేసి తాడేపల్లికి రమ్మన్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ కొట్టుకుపోకుండా ముందస్తుగా చర్యలు తీసుకుని వెంటనే జడ్పీ చైర్మన్ ని నియమించారు. భీమటం చెందిన జడ్పిటిసి రామ గోవిందరెడ్డిని జడ్పీ చైర్మన్‌గా ఖరారు చేశారు.

ఇక మిగిలినవి జిల్లా అధ్యక్ష పదవులు ఇందులో గతంలో కడప జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబు ఉండగా, అన్నమయ్య జిల్లాకు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే వీరి ఇరువురిని ఇప్పుడు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కడప జిల్లాకు సొంత మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇంచార్జ్‌గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అయితే ఇప్పుడు రెండు జిల్లాలను కూడా రెడ్లకు కేటాయించడం విశేషం. అంతేకాకుండా కడప నగరంలో బీసీ నేతగా వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడిగా ఉన్న సురేష్ బాబును కాదని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే అన్నమయ్య జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డికి అలాగే కడప జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్ బాబుకి ఇద్దరికీ కూడా పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో సంచిత స్థానాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

శ్రీకాంత్ రెడ్డికి అలాగే సురేష్ బాబుకి ఇద్దరికీ కూడా రాష్ట్ర విభాగంలో మంచి స్థానాలు ఇస్తామని హామీ తోనే కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులను మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన నేతలు అధినేత జగన్‌తో సమావేశమై కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క నేతతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీని పార్టీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని దిశానిర్ధేశం చేశారు. రానున్న నాలుగు నెలల పార్టీ కోసం కష్టపడాలని ప్రతి ఒక్కరికి సూచించినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా పార్టీని మరింత బలోపేతం చేయాలి అంటే ముందు సొంత జిల్లా నుంచే మార్పులు చేర్పులు చేస్తే గాని పార్టీ బలోపేతం కాదు అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ తనదైన శైలిలో రాజకీయం మొదలుపెట్టారని స్థానిక నేతలు అంటున్నారు. ఘోర పరాజయం పొందిన తరువాత పార్టీ ప్రక్షాళన చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో సొంత జిల్లా నుంచి ప్రక్షాళన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..