YSR Law Nestham Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని యువ న్యాయవాదులకు సీఎం జగన్ ప్రభుత్వం నెల నెలా ‘వైఎస్సార్ లా నేస్తం’ రూ.5వేల స్టైఫండ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో 2023–24 సంవత్సరానికి సంబంధించి మొదటివిడత కింద ‘వైఎస్సార్ లా నేస్తం’ డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు వైఎస్సార్ లా నేస్తం నిధులను జమచేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మొత్తం 5 నెలల డబ్బులు.. రూ. 25 వేల చొప్పున జమచేయనున్నారు. మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నట్లు ఏపీ సీఎంఓ వెల్లడించింది.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు.. వృత్తిలో నిలదొక్కుకునేలా జగన్ ప్రభుత్వం.. మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు మొత్తం రూ.41.52 కోట్లు జమచేసినట్లు సీఎంఓ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..