Andhra Pradesh: ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన.. బస్సు యాత్ర వాయిదాపై విమర్శలు.. అక్కడి నుంచి పర్మిషన్ రాలేదేమో అంటూ వైసీపీ సెటైర్లు..
ఏపీ రాజకీయాల్లో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. అధికార పార్టీ టార్గెట్‌గా పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేస్తుంటే.. జనసేనానికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత పేర్నినాని. పవన్ త్వరలో చేపట్టబోయే యాత్ర వాయిదా పడటంపైనా..
Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. అధికార పార్టీ టార్గెట్‌గా పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేస్తుంటే.. జనసేనానికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత పేర్నినాని. పవన్ త్వరలో చేపట్టబోయే యాత్ర వాయిదా పడటంపైనా వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ దసరా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే బస్సు యాత్ర వాయిదా పడింది. కొన్ని కారణాల వల్ల యాత్రను వాయిదా వేస్తున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేనాని నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) కౌంటర్ ఇచ్చారు. యాత్రను వాయిదా వేసుకోవడానికి అసలు కారణం ఏంటని ప్రశ్నించారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నారా.. లేక చంద్రబాబు పర్మీషన్ ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితమవుతుందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రజల్లో జనసేనకు ఆదరణ పెరుగుతుందనీ.. ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలకు అధికార పక్షం నుంచి ధీటైన కౌంటర్ వచ్చింది. జనసేన ఎన్ని సీట్లలో పోటీచేస్తుంది.. అందులో ఎన్నింటిలో గెలుస్తుందో మీ చిలక జోస్యం చెప్పలేదా.. అంటూ పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పేర్ని నాని.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రభుత్వంపై జనసేన విమర్శలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటే.. దానికి ప్రతిగా జనసేన కూడా ధీటైన సమాధానం ఇస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికి.. లోపాయికారిగా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉందని వైసీపీ నాయకులు ఎప్పటినుంచో విమర్శిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలనే పవన్ కళ్యాణ్ తూచ తప్పకుండా పాటిస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బస్సు యాత్ర వాయిదాపై కూడా వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ.. టీడీపీ నుంచి అనుమతి రాలేదా అంటూ ఎద్దేవా చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..