Andhra: గర్భసంచిలో కాకుండా పేగులో పెరిగిన పిండం.. పాపం జ్యోత్స్న
తెల్లవారితే ఇంట్లో పెళ్లి.. ఇల్లంతా చుట్టాలు, బంధువులతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. బంధుమిత్రులంతా పెళ్లిసంబురాల్లో మునిగిపోయారు. ఇంతలోనే ఆ ఇల్లు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పటివరకూ సంతోషంగా గడిపిన వరుడి వదిన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లిన ఆమె మృత్యు ఒడికి చేరుకుంది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.

ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడులో పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి మారేశ్వరరావు తమ్ముడు చెన్నారావు వివాహం. ఆ రోజు మధ్యాహ్నం నుంచి జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండటంతో భర్త చింతలపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అదే రోజు రాత్రి తమ్ముడి వివాహం ఉండటంతో మారేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి భార్యను తీసుకొచ్చారు. సాయంత్రం ఓ స్కానింగ్ సెంటర్‌లో పరీక్ష చేయించారు. అనంతరం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. టెస్టులు చేసిన డాక్టర్ జ్యోత్స్న గర్భం దాల్చిందని, గర్భసంచిలో కాకుండా పిండం పేగులో పెరగటంతో అది పగిలిపోయి రక్తస్రావమైందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో మారేశ్వరరావు రూ.40వేలు ఫీజు చెల్లించి భార్యను ఆస్పత్రిలో చేర్చారు.
సదరు వైద్యునితోపాటు మరో ఇద్దరు డాక్టర్లు అదే రోజు రాత్రి బాధితురాలికి శస్త్రచికిత్స చేశారు. గురువారం ఉదయం భర్తతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆపరేషన్ వికటించే మృతి చెందిందని ఆరోపిస్తూ, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలోనే పరిస్థితి బాగోలేదని, ఎక్కడికి తీసుకెళ్లినా ఫలితం ఉండదని చెప్పామని సదరు డాక్టర్ తెలిపారు. భర్త చేయమంటేనే జ్యోత్స్నకు ఆపరేషన్ చేశామని వివరించారు. మృతురాలికి రెండేళ్ల పాప ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




