AP Politics – Ganta Srinivas: గంటా శ్రీనివాసరావు టీడీపీ లోనే కొనసాగుతారా?.. అందుకే నిర్ణయం మార్చుకున్నారా?..
Andhra Pradesh: ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు టీడీపీ లోనే కొనసాగనున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ లోకి వెల్లకపోవడమే మేలని అనుకుంటున్నారా?
Andhra Pradesh: ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు టీడీపీ లోనే కొనసాగనున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ లోకి వెల్లకపోవడమే మేలని అనుకుంటున్నారా? టీడీపీ లో ఉంటూ లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలని డిసైడ్ అయ్యారా? అందుకే మొన్న విశాఖలో తన నియోజకవర్గ నేతలతో కలిసి లోకేష్ బర్త్ డే వేడుకల్లో స్వయంగా పాల్గొన్నారా? అసలు గంటా మదిలో ఏముంది?.. ప్రత్యేక కథనం మీకోసం..
రెండు దశాబ్దాలుగా గంటా శ్రీనివాస్ ని, ఉత్తరాంధ్ర రాజకీయాలను వేరు చేసి చూడలేము. ఒకసారి ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. అందులోనూ రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా కావడంతో గంటా రాజకీయ కదలికలపై అందరికీ ఒక కన్ను ఉండేది. అయితే 1998 లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి మొదట అనకాపల్లి ఎంపీ గా, 2004 లో చోడవరం ఎమ్మెల్యే గా గెలుపొందిన గంటా శ్రీనివాస్ 2009 లో టీడీపీ నుంచి బయటకు వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి అనకాపల్లి శాసనసభ్యులుగా గెలుపొందారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత కొన్నాళ్ళు కాంగ్రెస్ నేతగా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఆయన కాబినెట్ లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గానే పాల్గొన్న గంటా.. కాంగ్రెస్‌ని వీడి 2014లో మళ్లీ టీడీపీలో చేరారు. భీమిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అనూహ్యంగా చంద్రబాబు కాబినెట్‌లో మానవ వనరుల శాఖామంత్రిగా స్తానం సంపాదించి 5 ఏళ్ళు అప్రతిహతంగా పని చేశారు. అంతకుముందు కాంగ్రెస్ కాబినెట్‌లో ఉంటూ మళ్లీ టీడీపీ కాబినెట్‌లో కూడా కొనసాగిన ఘనత గంటా దే.
మళ్లీ 2019 ఎన్నికల సమయానికి గంటా పార్టీ మారుతారంటూ అనేక ఉహాగానాలొచ్చినా చివరకు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. కానీ చివరి నిమిషం వరకు గంటా ఎక్కడినుంచి పోటీ చేస్తారో తెలీక పోవడంతో నార్త్ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్న పంచకర్ల రమేష్ లాంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడ్డా.. గంటాకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కూడా ఏమీ చేయలేకపోయింది. కానీ ఎన్నికల ప్రచార సమయంలోనే, ప్రచారం, పార్టీ ఎన్నికల ఖర్చు లాంటి అనేక అంశాలపై గంటాకి, పార్టీ అధిష్టానానికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా గంటా కి అధిష్టానం పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చన్న చర్చ జోరుగా సాగింది. అయితే టీడీపీ ఓటమి పాలైనా గంటా గెలవడంతో మళ్లీ అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడే ఉంటారన్న ప్రచారానికి అనుగుణంగానే గంటా వైసీపీ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే అదే సమయంలో గంటా రాకను వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయిరెడ్డి వ్యతిరేకించడంతో పాటు విశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు కూడా తీవ్రంగా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడే ఉంటారని, గంటా అవినీతిని వెలికి తీసి శిక్షిస్తామని, విశాఖ భూ వివాదాల్లో గంటా ఉన్నారని, గంటా చాప్టర్ క్లోజ్ అంటూ అవంతి పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయినప్పటికీ గంటా శ్రీనివాస్.. ముఖ్యమంత్రి సమీప బంధువు వైఎస్ అనీల్ రెడ్డి ద్వారా జగన్‌ను ఒప్పించి విజయసాయిరెడ్డి కి నచ్చ చెప్పేలా గట్టి ప్రయత్నాలే చేశారని వినిపించింది. పార్టీ మారుతున్నట్టు ఏకంగా చంద్రబాబుకే చెప్పిన గంటా వైసీపీ లో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అక్కడ విజయసాయిరెడ్డి ససేమిరా అనడంతో అప్పట్లో ఆ నిర్ణయం పెండింగ్‌లో ఉండింది.
మధ్యలో గంటా శ్రీనివాస్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసమంటూ పార్టీకి సంబంధం లేకుండా రాజీనామా చేశారు. ఆ ఉద్యమం పెద్ద ఎత్తున అయితే మొదట రాజీనామా చేసిన ఎమ్మెల్యే గా తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావించిన గంటాకు అనుకున్నంత ప్రయోజనం లేకుండా పోయింది. గంటా రాజీనామా విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం, వైసీపీ కూడా అంశాన్ని లైట్‌గా తీసుకోవడంతో గంటాకి పెద్ద ప్రయోజనం లేకుండా పోగా పార్టీ నిర్ణయాన్ని కాదని రాజీనామా చేయడం టీడీపీకి కాస్త ఇబ్బందిని కలిగించింది.
అదే సమయంలో గంటా రెండో దశ కోవిడ్‌కి ఎఫెక్ట్ అయ్యి అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యారు. పోస్ట్ కోవిడ్ ప్రభావంతో ఏకంగా క్రిటికల్ బైపాస్ సర్జరీ అవసరమవడం, మేజర్ ఆపరేషన్ విజవంతంగా పూర్తికావడంతో కొన్నాళ్ళు గంటా విశ్రాంతిలో ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కాబినెట్ లో ఉన్న మంత్రులకు విలువ లేదని, అనేక సమస్యలు తో జగన్ మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, మళ్లీ టీడీపీ కె భవిష్యత్ ఉంటుందన్నట్టు గంటా తనను కలిసే నేతలకు చెప్పేవారని వినిపోయించాయి. వైసీపీ కి వెళ్లేందుకు అడ్డంకులు ఉండడం, వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నట్టు భావించిన గంటా మళ్లీ టీడీపీ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముందుకెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ తన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారు. వార్డుల అధ్యక్షులను ఆక్టివేట్ చేయడం దగ్గరనుంచి తెలుగు యువత కమిటీలను కొత్తగా ఏర్పాటు చేసి పార్టీ ఇస్తోన్న ప్రతీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు గంటా.
ఇవన్నీ ఒక ఎత్తయితే మొదటి నుంచి లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన గంటా ఇప్పుడు లోకేష్ నాయకత్వాన్ని బలపరిచేవిధంగా వ్యవహరించడం గంటా వైఖరిలో మార్పునకు అద్దం పడుతోంది. జనవరి 23 న లోకేష్ బర్త్ డే సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తన కార్యాలయంలో గంటా కేక్ కట్ చేసి తన నియోజకవర్గ నేతలతో సెలబ్రేట్ చేసుకున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీలో ఉండాలంటే లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం తప్ప వేరే ఛాయిస్ లేదని డిసైడ్ అయ్యే గంటా తాజాగా లోకేష్ ని బలపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేది పొలిటికల్ వర్గాల టాక్.
వీటన్నింటికంటే హైలైట్ అంశం ఏంటంటే గంట పై కారాలు మిరియాలు నూరే అవంతి శ్రీనివాస్ ఇటీవల కాలంలో గంటా పట్ల అంత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించకపోగా ఎవరి విధానాలు వారివి అంటూ ముందుకెళ్తుండడం విశాఖ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది.
-ఈశ్వర్, టీవీ9 తెలుగు, విశాఖపట్నం.
Also read:
Andhra Pradesh: అనంతను ఊపేస్తున్న కొత్త జిల్లాల రచ్చ.. ఆ నాలుగు జిల్లాల కోసం పెరుగుతున్న డిమాండ్లు..
Trs vs Bjp: తెలంగాణలో ఆసక్తికర రాజకీయం.. బీజేపీ తప్పటడుగులు, స్పీడ్ పెంచుతున్న టీఆర్ఎస్..