Prathipadu: ఆయనొస్తారా? ఆమెకే ఇస్తారా?.. నిలిచేదెవరు? గెలిచేదెవరు?

Mekathoti Sucharitha: ఆయన ఐఆర్ఎస్ అధికారి, వీఆర్ఎస్ తీసుకున్నారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. తమ కుటుంబ నేపధ్యాన్ని ఉపయోగించుకొని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకున్నారు. ఢిల్లీ సభకు వెళ్లాలని తహతహలాడారు. అయితే పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ పదవి తీసుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలన్న ఆలోచన వదులుకున్నారా.. భార్యనే మరోసారి బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారా?

Prathipadu: ఆయనొస్తారా? ఆమెకే ఇస్తారా?.. నిలిచేదెవరు? గెలిచేదెవరు?
Mekathoti Sucharitha Couple With CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 19, 2023 | 5:10 PM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయకేతనం ఎగరవేశారు మేకతోటి సుచరిత. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత.. వైఎస్‌ మరణంతో జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి మళ్లీ గెలిచారు. 2014లో మాత్రం రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. అయినా పట్టువదలకుండా నియోజకవర్గంలోనే ఉంటూ 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఏకంగా హోంమంత్రి పదవి దక్కటంతో ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకున్నారు. అయితే కేబినెట్‌ విస్తరణలో మంత్రి పదవిపోవటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు సుచరిత. ఓ దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. సీఎం జగన్ సర్దిచెప్పడంతో పార్టీలో కొనసాగారు. అంతా బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో సుచరితనే మళ్లీ పోటీచేస్తారా? ఆమె భర్త తెరపైకొస్తారా అన్న చర్చయితే వైసీపీ శ్రేణుల్లో ఉంది.

మంత్రి పదవి పోవటంతో సుచరిత అసంతృప్తి చెందినప్పుడే ఆమె భర్త దయాసాగర్ పేరు తెరపైకొచ్చింది. అనారోగ్య సమస్యలతో వచ్చే ఎన్నికల్లో పోటీకి విముఖత చూపారు సుచరిత. ఈ క్రమంలోనే దయాసాగర్‌కు బాపట్ల ఎంపీ టికెట్ ప్రతిపాదన వచ్చింది. అయితే పార్టీ అధినాయకత్వానికి సుచరిత దంపతులు చేసిన అభ్యర్థనకు ఎలాంటి భరోసా లభించలేదన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో ఓ సమావేశంలో సుచరిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాల్సి ఉంటుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుంటే సుచరిత భర్త దయాసాగర్‌ టీడీపీలో వెళ్లే ఛాన్సుందన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. తన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావటంతో రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ జగన్‌తోనే ఉంటామంటూ ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు సుచరిత.

ప్రత్తిపాడులో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సుచరిత దంపతుల్లో ఎవరు పోటీచేస్తారన్న చర్చ జరుగుతుండగానే మచిలీపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్‌గా దయాసాగర్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం జిల్లా వైసీపీ నేతల్లో చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న దయాసాగర్‌కి ఉన్నట్లుండి పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ ఇవ్వడం వెనుక మతలబు ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారట పార్టీ నేతలు. ఈ నియామకంతో ఆయనకు ఎన్నికల్లో టికెట్‌ లేదని పార్టీ నాయకత్వం చెప్పేసినట్లేనని అంటున్నారు. అయితే మళ్లీ సుచరితనే పోటీ చేస్తారా అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మరి అధిష్ఠానం మదిలో ఏముందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం