Aghora: అఘోరాలు ఎలా ఉంటారు? ఈ అఘోరీ మాత ఎందుకిలా ఉన్నారు? ఆలయాల సందర్శనకు కారణమేంటి?

గతంలో అఘోరాలు చాలా అరుదుగా కనిపించేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దర్శనమిచ్చేవారు. అంతే ఆ తరువాత చట్టుక్కున మాయమైపోయేవారు. కానీ కాలం మారిపోయింది. వీళ్లు ట్రెండింగ్ ను, ఫాలోయింగ్ ను కోరుకుంటున్నారో.. జనమే వేలం వెర్రిగా వీరిని ట్రెండ్ చేస్తున్నారో కానీ.. వీళ్లు ఈమధ్య బాగా ఫేమస్ అవుతున్నారు. ఇంతవరకు ఓకే. తెలుగురాష్ట్రాల్లో గుళ్లు, గోపురాల చుట్టూ అఘోరీ మాత తిరుగుతోంది. దీని వెనుక అంతరార్థం ఏమిటి?

Aghora: అఘోరాలు ఎలా ఉంటారు? ఈ అఘోరీ మాత ఎందుకిలా ఉన్నారు? ఆలయాల సందర్శనకు కారణమేంటి?
Aghori
Follow us
Gunneswara Rao

|

Updated on: Nov 15, 2024 | 9:30 PM

అఘోరీ.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఈ మనిషీ బాగా కనిపిస్తోంది. తెలుగునాట ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ. ఇక నెట్టింట.. ఆమె గురించే రచ్చ. సాధారణంగా అఘోరాలు.. జన జీవనంలోకి రారు. పబ్లిసిటీ కోరుకోరు. మరి ఈవిడెందుకు వచ్చింది? అసలు వాళ్ల లైఫ్ స్టైలే సెపరేట్ గా ఉంటుంది. భౌతిక సుఖాలను పూర్తిగా వదిలేస్తారు. మరి ఈ అఘోరీ ఎందుకు.. ఓ మామూలు మనిషిలా జీవిస్తున్నట్టుగా కనిపిస్తోంది? కారులో తిరుగుతోంది. ఖరీదైన సౌకర్యాలూ ఉన్నాయి. అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పటివరకు అఘోరాల గురించి విన్నదానికి, చూసినదానికి.. ఇక్కడ ఈమె ప్రవర్తనకు అసలు ఎక్కడా పొంతనే కనిపించదు. పెట్రోల్ పోసుకుంటానంటుంది. ఆత్మహత్యకు చేసుకుంటానంటుంది. కారుతో నదిలోకి వెళ్లి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. ఆగ్రహంతో రగిలిపోతుంది. ఆవేదనతో కుంగిపోతుంది. అసలు.. అఘోరాలకు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? వాళ్ల జీవితంలో ఇన్ని యాక్షన్స్ సీన్స్ కు చోటుందా? ఈవిడను చూస్తే.. అఘోరీలు ఇలా ఉంటారా అన్న అనుమానం కూడా వస్తుంది. ఇంతకీ.. అఘోరీల జీవనవిధానం ఎలా ఉంటుంది? వారి రోజువారీ జీవితం ఎలా గడుస్తుంది? మరి ఈ అఘోరీ మాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది?

చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత ఇప్పుడో సెలబ్రెటీ. ఆమె వెళ్లినచోటల్లా తనను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. దీంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. దానికి ఆమె జీవనశైలి కూడా ఓ కారణం. నిజానికి అఘోరాలు.. కాలుతున్న శవాల మధ్యే ఉండడానికి ఇష్టపడతారు. వారు దైనందిక అవసరాలను తీర్చుకునేది కూడా అక్కడే. ఒళ్లంతా బూడిదతో, ఒంటి నిండా మనుషుల పుర్రెలతో కనిపిస్తారు. మృతదేహాలను తినడం, గంజాయి తాగడం.. స్మశానాల్లో సంచరించడం వీరికి నిత్యకృత్యం. నిజానికి వీరిపై మన సమాజంలో పవిత్రమైన భావనే ఉంది. అందుకే వారిని ప్రత్యేకంగా చూస్తారు. అఘోరా అన్న పేరు వెనుక అర్థం చూస్తే.. భయం లేని.. అని ఉంటుంది. కానీ వీరి వేషధారణ, జీవనశైలి చూస్తే.. ఒక్కోసారి వెన్నులో వణుకు పుడుతుంది. కుంభమేళాలో ఎక్కువగా కనిపిస్తారు. ఆ తరువాత బయట దర్శనమివ్వరు.

మనిషి పుర్రెలే వీరికి పాత్రలు. శవాల శరీరమే వీరికి ఆహారం. ఇలాంటి వాటివల్లే తాము భగవంతునికి దగ్గరగా ఉంటామన్నది వారి అభిప్రాయం. లోకంలో అందరి మంచి కోసమే వీరు పూజలు చేస్తారు. అంతేకాని.. వ్యక్తిగత కోరికలతో వచ్చి తమ ఆశీస్సులు కోరేవారిని వీరసలు పట్టించుకోరు. అఘోరాల్లో ఎక్కువగా ఉండేది పురుషులే. బెంగాల్ లో మాత్రం మహిళా అఘోరాలు.. దుస్తులతో కనిపిస్తారు. కొంతకాలంగా అఘోరాలు బయటి ప్రపంచంలోకి వస్తున్నారు. అప్పుడు బట్టలు వేసుకుంటున్నారు. సెల్ ఫోన్లు వాడడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఉపయోగించడంతోపాటు వ్యక్తిగత వాహనాలనూ వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అఘోరాలు వేలాదిగా ఉన్నారని అంచనా. అఘోరాలు చనిపోతే.. వారి మృతదేహాలను ఇతర అఘోరాలు తినేస్తారని చాలామంది భావిస్తారు. నిజానికి వారు అలా చేయరు.. ఆ డెడ్ బాడీస్ ను పూడ్చడమో, దహనం చేయడమో చేస్తారు.

గతంలో అఘోరాలు చాలా అరుదుగా కనిపించేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దర్శనమిచ్చేవారు. అంతే ఆ తరువాత చట్టుక్కున మాయమైపోయేవారు. కానీ కాలం మారిపోయింది. వీళ్లు ట్రెండింగ్ ను, ఫాలోయింగ్ ను కోరుకుంటున్నారో.. జనమే వేలం వెర్రిగా వీరిని ట్రెండ్ చేస్తున్నారో కానీ.. వీళ్లు ఈమధ్య బాగా ఫేమస్ అవుతున్నారు. ఇంతవరకు ఓకే. ఇంతకీ తెలుగురాష్ట్రాల్లో గుళ్లు, గోపురాల చుట్టూ అఘోరీ మాత ఎందుకు తిరుగుతోంది?

అఘోరీ ప్రవర్తన, మాటలు అన్నీ వివాదాస్పదమే. అందరూ కాకపోయినా కొందరు అఘోరీలు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తిలో శివయ్య దర్శనం కోసం వచ్చి నానాయాగీ చేయాల్సిన అవసరం లేదు. ఆలయ సంప్రదాయం, నిబంధనలను పాటిస్తే సరిపోతుంది. కానీ అఘోరీ అలా చేయలేదు. వస్త్రాలు లేకుండా ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆలయ సిబ్బంది అనుమతించకపోయేసరికీ.. ఆవేశంతో ఊగిపోయింది. తనపై, కారుపై పెట్రోల్ ను పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు శక్తికి మించి ప్రయత్నిస్తే కాని పరిస్థితి అదుపులోకి రాలేదు. తొలుత ఆమెను అక్కడి నుంచి పంపివేసినా.. మళ్లీ రాత్రి సమయంలో వచ్చింది. చివరకు వస్త్రాలు ధరించి, కపాలమాలలు తీసేస్తేనే దర్శనానికి అనుమతిస్తాం అని ఆలయ అధికారులు తేల్చి చెప్పేసరికీ దానికి ఒప్పుకుంది. అప్పుడు ఆమెకు భద్రత నడుమ స్వామివారి దర్శనం చేయించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన మాత్రమే.

కర్నూలులో జరిగిన సంఘటనను పరిశీలిస్తే.. అక్కడ ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలీసుల ఇబ్బంది వల్లే ప్రమాదం జరిగిందని చెప్పింది. చివరకు కర్నూల్ నుంచి యాగంటి వరకు పాదయాత్ర చేసింది. మహానంది, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు చేస్తానని అప్పుడే చెప్పింది. సీన్ కట్ చేస్తే.. మహానంది క్షేత్రంలో ప్రత్యక్షం అయ్యింది. అక్కడి అధికారులు.. ఆలయ మర్యాదలతోనే ఆమెకు దర్శనం చేయించారు. అక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అఘోరీతో సెల్ఫీలు దిగడానికి స్థానికులు తెగ ఉత్సాహం చూపించారు. వాళ్ల సంగతి సరే.. కానీ ఇలాంటి వాటికి అఘోరాలు దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ అఘోరీ మాత్రం.. రాజకీయ నాయకురాలిలా స్పీచ్ లు కూడా ఇవ్వడం అక్కడున్నవారిని ఆశ్చర్యపోయేలా చేసింది. మహిళల మీద దాడులు జరగకుండా చూడాలని, గోహత్యలను అరికట్టాలని చెప్పింది. మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది.

కోటప్పకొండ నుంచి విజయవాడ వెళుతూ.. చిలకలూరిపేటలో అఘోరీ ఆగింది. బైపాస్ రోడ్డు వద్ద ఆగి పూజలు చేసింది. అక్కడ అఘోరీని చూడడానికి.. ఆమెను వీడియో తీయడానికి స్థానికులు ఎగబడ్డారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆమె క్రేజ్ ఎంత పెరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. విజయవాడలోనూ దర్శనమిచ్చింది అఘోరా. అక్కడైతే అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోయింది. ఇక పల్నాడు జిల్లా అమరేశ్వరాలయం దగ్గర అయితే అఘోరీ.. పెద్ద సీనే క్రియేట్ చేసింది. భక్తుల రద్దీలో హంగామా సృష్టించింది. కృష్ణానదిలోకి కారుతో దూసుకుపోవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు, ఆలయ సిబ్బంది అలెర్ట్ గా ఉండడం.. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి వెళ్లిన అఘోరీ.. పంచారామ క్షేత్రంలో కొలువైన సోమేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయం నుంచి బయటకు వచ్చాక.. సనాతన ధర్మం కాపాడాలంటూ నినాదాలు చేసింది. అయితే అక్కడ అఘోరీని చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. వరంగల్ జిల్లాలోనూ అఘోరీ పర్యటించింది. వర్ధన్న పేట మండలం ఇల్లందులోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. అక్కడ కూడా ఆమెను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. వరంగల్ జిల్లాలోని మామునూరు సమీపంలోని స్మశాన వాటికను కూడా దర్శించుకుంది అఘోరీ మాత. అక్కడ కూడా ఆమెను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. మామునూర్ నుంచి భద్రకాళి ఆలయం వరకు పాదయాత్ర చేసింది అఘోరీ మాత. ఆ తరువాత అమ్మవారి దర్శనం చేసుకుంది.

ఇది అఘోరీ మాత స్టోరీ. తెలుగురాష్ట్రాల్లో ఆమె చేస్తున్న హల్ చల్ తో ఇప్పటికే క్రేజు సంపాదించుకుంది. ఆమె మాటలను బట్టి చూస్తే.. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా కనిపిస్తోంది. కానీ, ఆమె ఉద్దేశం ఏమిటో.. ఇంకా క్లియర్ గా తెలియదు. అందుకే సమాజంలో తిరిగేటప్పుడు సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా, ఆలయాల్లో ఉండే నియమ నిబంధనలను పాటిస్తే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.