
విజయవాడ, డిసెంబర్ 24: విజయవాడలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు హోటల్లో ఎలుకలు నూడిల్స్ తింటూ కనిపించాయి. ఈ దృశ్యాలను అక్కడ చదువుకుంటున్న ఓ పీజీ విద్యార్థి తన మొబైల్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కొన్ని గంటల్లోనే విపరీతంగా వైరల్ అయింది.
డ్వాక్రా మహిళల కోటాలో టిఫిన్, భోజనం సరఫరా చేయడానికి విజయవాడ కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణంలో ‘ఆకలి రాజ్యం’ పేరుతో హోటల్ ని ప్రారంభించారు. అక్కడ కేవలం టిఫిన్ భోజనం సరఫరా చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి ఫాస్ట్ ఫుడ్ , పిజ్జా నూడిల్స్ కూడా అందుబాటులో ఉంచారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంతో ఉడికించిన నూడిల్స్ ను పక్కన ఉంచి.. కనీస శుభ్రత పాటించడం లేదు. ఈ క్రమంలో క్యాంటీన్ లోపల ఉన్న ఎలుకలు వాటిని తినడం ప్రారంభించాయి. అక్కడికి వచ్చిన ఓ పీజీ విద్యార్థి ఆసుపత్రి క్యాంటీన్లో నూడిల్స్ తింటున్న ఎలుకల వీడియో తీసి వైరల్ చేశాడు.
ఈ వీడియోని చూసిన జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా జరగటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసినవారు హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి శుభ్రమైన ఆహారాన్ని ఆసుపత్రిలో పేషెంట్లకు సరఫరా చేయాల్సింది పోయి.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.