Vizianagaram TDP: ఇదెక్కడి బాధరా బాబూ.. తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు!

| Edited By: Balaraju Goud

Mar 29, 2024 | 11:34 AM

తెలుగుదేశం పార్టీలో టికెట్ల ప్రకటనతో మొదలైన అసమ్మతి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు వరుస నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. టిక్కెట్ దక్కకపోతే ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగి సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న నిరసనలపై అధిష్టానం సైతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటుందట.

Vizianagaram TDP: ఇదెక్కడి బాధరా బాబూ.. తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు!
Tdp Leaders
Follow us on

తెలుగుదేశం పార్టీలో టికెట్ల ప్రకటనతో మొదలైన అసమ్మతి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు వరుస నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. టిక్కెట్ దక్కకపోతే ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగి సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న నిరసనలపై అధిష్టానం సైతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటుందట. క్యాడర్ గ్రూపులుగా విడిపోయి తలోదారి అన్నట్లు మారింది. ప్రతిపక్ష టీడీపీలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. బలమైన క్యాడర్ ఉన్న ఈ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక తరువాత గందరగోళంలో పడింది. ప్రస్తుతం జిల్లాలోని గజపతినగరం, ఎస్ కోట, చీపురుపల్లి, నెల్లిమర్లలో క్యాడర్ గ్రూపులుగా విడిపోయి ఎవరి దారి వారిది అన్నట్లు మారింది. వీటిలో గజపతినగరం నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడుని పక్కనపెట్టి కొత్తగా కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కట్టబెట్టింది అధిష్టానం. దీంతో ఈ నియోజకవర్గంలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. కెఏ నాయుడు తన కార్యకర్తలతో సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లి శ్రీనివాసరావుకు సహకరించేది లేదని తేల్చి చెప్పారట. అప్పటి నుండి అభ్యర్థికి సహకరించకుండా ఎప్పటికప్పుడు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కే ఏ నాయుడు అనుచరులు.

ఇక మరో నియోజకవర్గం ఎస్ కోట. ఇక్కడ గత రెండేళ్లుగా ఎన్ ఆర్ ఐ గొంప కృష్ణ తనకే టిక్కెట్ దక్కుతుందని గంపెడాశలతో ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేపట్టి విస్తృతంగా పర్యటించారు. తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ప్రస్తుత ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికే టిక్కెట్ కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన గొంప కృష్ణ కార్యకర్తలతో సమావేశమై టిక్కెట్ విషయంలో పునరాలోచించాలి అని డిమాండ్ చేశారు. తన పార్టీ కార్యాలయంపై ఉన్న పార్టీ గుర్తులు, జెండాలు తొలగించి నిరసన తెలిపారు. లోకేష్, చంద్రబాబులు తనను మోసం చేశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో కోళ్ల లలిత కుమారి వర్గం ఓ వైపు, గొంప కృష్ణ వర్గం మరోవైపు సై అంటే, సై అంటూ జబ్బలు చరుస్తున్నారట.

ఇక మరో కీలక నియోజకవర్గం చీపురుపల్లి. ఇక్కడ ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇంచార్జిగా ఉన్నారు. అయితే నాగార్జునను పక్కనపెట్టి మరొక కొత్త వ్యక్తికి టిక్కెట్ కేటాయించాలని యోచిస్తుందట టీడీపీ అధిష్టానం. ఇక్కడ నుండి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు పేర్లతో సర్వే కూడా నిర్వహించి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి బరిలో దిగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు పార్టీ పెద్దలు. దీంతో మనస్థాపానికి గురైన నాగార్జున పార్టీ కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నాడట. ఇక్కడ కొత్త అభ్యర్థికి టిక్కెట్ కేటాయిస్తే కిమిడి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది.

ఇక పొత్తులో భాగంగా నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకి కేటాయించింది టీడీపీ. ఇక్కడ జనసేన నుండి లోకం నాగమాధవి పోటీ చేస్తుండగా, టీడీపీ నుండి టిక్కెట్ ఆశించి భంగపడ్డ కర్రోతు బంగార్రాజు అసంతృప్తితో ఉన్నాడు. పొత్తులో నెల్లిమర్లకు టిక్కెట్ కేటాయించారు కాబట్టి మరో చోట ఎక్కడ నుండైనా సరే తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నాడట బంగార్రాజు. ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే తన రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నాడట. ఇక్కడ జనసేనకు కూడా టీడీపీ శ్రేణులు హార్ట్ ఫుల్ గా సహకరించట్లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇలా జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో క్యాడర్ గ్రూపులుగా మారి అయోమయంలో పడింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో మరోసారి టీడీపీ ఘోర పరాభవం చవిచూడక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…