CM KCR: విశాఖ స్టీల్ ప్లాంటు కొంటే వచ్చే ప్రయోజనం ఏంటి..? సీఎం కేసీఆర్ మదిలోని ఆలోచన ఇదే
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనడంపై తెలంగాణ సర్కారు తర్జనభర్జన పడుతుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌పై సీఎంకు నివేదిక అందజేసింది సింగరేణి అధికారుల బృందం. హోల్‌సేల్‌గా స్టీల్ కొంటే లాభమని సింగరేణి అధికారుల బృందం చెబుతుంది. మరి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటు కొంటే తెలంగాణ ప్రభుత్వానికి లాభమే కలుగుతుందని సింగరేణి కాలరీస్ అధికారుల బృందం నిర్థారణకు వచ్చింది. తాజాగా బిడ్డింగ్‌లో పాల్గొనడంపై రాష్ట్ర సర్కారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రెండు రోజుల పర్యటించిన ఐదుగురు అధికారుల సింగరేణి బృందం సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అవసరమైన ఉక్కు కొనుగోలు చేసేందుకు విశాఖ స్టీల్ EOIలో పాల్గొనాలని అధికారులు బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మరికాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడవచ్చు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన కోకింగ్ కోల్ సింగరేణిలో అందుబాటులో లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం సింగరేణికి లేదు. మూలధనం కింద నేరుగా నిధులు అందించే వెసులుబాటు కూడా సింగరేణికి లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే బిడ్ దాఖలు చేయాలని సింగరేణి కోరుతోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలు, పథకాల కోసం ఏటా 3 లక్షల టన్నుల స్టీల్ అవసరమని ప్రభుత్వవర్గాలు గుర్తించాయి. దీన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నేరుగా కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఎంతో లాభం కలుగుతుందని భావిస్తున్నారు. సింగరేణికి నిధులు సమకూరిస్తే లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో 5500 కోట్ల టర్నోవర్ కలిగిన తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను బిడ్డింగ్‌లోకి దింపితే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఏటా 73 లక్షల టన్నుల ద్రవరూప స్టీల్ తయారు చేయగల స్థాపిక సామర్ధ్యం విశాఖ స్టీల్ ప్లాంటుకు ఉంది. అంతే కాకుండా ఈ పరిశ్రమకు 20 వేల ఎకరాలకు పైగా భూమి ఉంది. వీటిన్నింటి వల్ల సంస్థను లాభాల్లో నడపడానికి అవకాశాలు ఉన్నాయని సింగరేణి అధికారులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ EOI దాఖలు చేసేందుకు ఈ మధ్యాహ్నంతో గడువు తీరనుంది. ఈ క్రమంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ ప్రజల తరపున తాను బిడ్ ప్రాసెస్‌లో పాల్గొంటానని cbi మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ప్రకటించారు. బిడ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వివరాలన్నీ వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలన్నది తమ ఆకాంక్ష అని లక్ష్మీనారాయణ టీవీ9తో చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..