Vijayasai Reddy : అక్కడ ధృతరాష్ట్రుని పాత్ర పోషించావా? వాటాలు తీసుకుని ఊరుకున్నావా.. అశోక్? : విజయసాయిరెడ్డి
గత నెలలో జగన్ గారు విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. నీ మెడికల్ కాలేజ్ ప్రతిపాదన ఏమైపోయింది అశోక్?..
Vijayasai reddy : “మెడికల్ కాలేజి పెడతామని మాన్సాస్ భూముల్ని తెగనమ్మాడు అశోక్.. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టకుండా అడ్డుకున్నాడు. గత నెలలో జగన్ గారు విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. నీ మెడికల్ కాలేజ్ ప్రతిపాదన ఏమైపోయింది అశోక్?” అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి మాన్సాస్ భూముల్లోని ఇసుకాసురులెవరు? అని ఆయన ప్రశ్నించారు.
2020లో ఏపీఎండీసీకి అప్పగించక ముందు మన్సాస్ భూముల్లో ఇసుక మైనింగ్ చేసిందెవరు? టీడీపీ హయాంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే కళ్లు మూసుకున్నావా అశోక్? సొంతపార్టీ నేతలు తవ్వేస్తుంటే ధృతరాష్ట్రుని పాత్ర పోషించావా? వాటాలు తీసుకుని ఊరుకున్నావా? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.
నర్సాపురం ఎంపీ రఘురామరాజు అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకీ ఆలస్యం.? : విజయసాయిరెడ్డి
నర్సాపురం ఎంపీ రఘురామరాజు అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో అన్యాయమైన ఆలస్యం తగదని వైసీపీ ఎంపీ, ఆపార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందన్న ఆయన.. అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు మిమ్మల్ని కలిశామని చెప్పిన ఆయన, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్ సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి విజయసాయి లేఖ రాశారు.
నర్సాపురం నియోజకవర్గంలో చట్ట బద్ధంగా ఎన్నికైన వ్యక్తి అవసరమని విజయసాయి చెప్పుకొచ్చారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని తెలిపారు. ఇకనైనా వేగంగా పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన సదరు లేఖలో డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్ పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉందని విజయసాయి చెప్పారు. పిటిషన్ దాఖలు చేసిన ఈ లోపు రెండు పార్లమెంట్ సమావేశాలు కూడా జరిగాయని గుర్తు చేశారు. తమకున్న అభ్యంతరాలను స్పీకర్ కార్యాలయం కొంత ముందుగా ఇచ్చినా బాగుండేదని తెలిపిన వైసీపీ ఎంపీ.. స్పీకర్ కార్యాలయం కోరిన మేరకు మార్పులు చేసి పిటీషన్ దాఖలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.