Vizag: వైజాగ్ బీచ్‌కు ఏమైంది.. నల్లగా మారిన తెల్లని ఇసుకతిన్నెలు.. పౌర్ణమి రోజే ఎందుకిలా..?
విశాఖలో మబ్బు మసకేసింది. ఏమైందో ఏమో కానీ తీరం నల్లటి కాటుకెట్టినట్టు కారుచీకటిలా మారిపోయింది. రాత్రికి రాత్రే ఆర్కేబీచ్‌లోని ఇసుక రంగు మారిపోయింది. తెల్లటి ఇసుక తిన్నెల్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నఫళంగా నల్లటి బొగ్గులా విశాఖ సాగరతీరం మారిపోయింది. అసలేం జరిగింది?
Andhra Pradesh: విశాఖ సాగరతీరాన్ని తలచుకుంటేనే మనసంతా తెల్లటి తెరచాపపై పరుచుకుంటుంది. నీలి నీలి ఆకాశం, నేలపైన బంగారువన్నె ఇసుక తిన్నెలు మది మదినీ పలకరిస్తాయి. ప్రతి హృదినీ పులకరిస్తాయి. ఇక వర్షాకాలం విశాఖ తీరంలో అందాలు చూడతరమా? అన్నట్టుంటాయి. అక్కడ వీచే చల్లటి గాలుల్లో ఏదో మహత్యం ఉంటుంది. అయితే ప్రశాంతతకు అద్దంపట్టే విశాఖ తీరం ఇప్పుడెందుకో నల్లబడింది. విశాఖ వాసుల మనసు బెంగపడింది. అసలెందుకిలా తెల్ల బంగారం నల్లబోయింది?. ఉన్నట్టుండి విశాఖ తీరంలోని తెల్లని ఇసుకతిన్నెలు నల్లగా మారిపోయాయి. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టు ఆర్కేబీచ్(Rk Beach)లోని ఇసుక నల్లటి కాటుకలా మారిపోయింది. దీంతో జనం హడలిపోతున్నారు. ఈ రోజు పౌర్ణమి. అందునా రక్షా బంధన్(raksha bandhan) పండుగ. ఉదయం విశాఖ ఆర్కే బీచ్ కు వచ్చిన వాకర్స్ రంగు మారిన ఇసుకను చాసి ఆశ్చర్యపోయారు. నిన్నటివరకు మామూలుగా ఉన్న ఇసుక తెల్లారేసరికి రంగు మారటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. భయంతో ప్రజలు అటువైపు వెళ్లడమే మానేసిన పరిస్థితి ఏర్పడింది.
ఎప్పుడూ తీరంలో సందడిచేసే జనం ఇప్పుడు అటు తొంగి చూడ్డానికే భయపడుతున్నారు. అసలేం జరిగిందో, ఏదైనా ప్రమాదం పొంచివుందేమోనని హడలిపోతున్నారు. అయితే భయపడాల్సిన పనేం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకి కొట్టుకురావడం సర్వసాధారణమేనని, అలా వచ్చినప్పుడు ఇసుక నల్లబడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఇనుప రజ ఎక్కువ శాతం సముద్రంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా తీరం నల్లటి బొగ్గులా మారిపోతుందంటున్నారు. అయితే దీన్ని ధృవీకరించుకోవాలని చెపుతున్నారు. సాధారణంగా క్రియాశీల అగ్నిపర్వతం సమీపంలో ఉన్న బీచ్‌లలో ఈ తరహా నల్లటి ఇసుక కనిపిస్తుందంటున్నారు పరిశోధకులు. లావా, బసాల్ట్‌రాక్స్, ఇతర నల్ల రంగు రాళ్ళు, ఖనిజాలతో కూడిన రాళ్ళు కోతకు గురై ఇసుక నల్లగా మారుతుందంటున్నారు నిపుణులు.
ప్రపంచ వ్యాప్తంగా నల్ల ఇసుకతో ఉన్న బీచ్ లకు ప్రసిద్ధి హవాయ్, కేనరీ దీవులు. భారత్ లో సైతం నల్ల ఇసుక బీచ్ లున్నాయి. త్రివేండ్రంలోని కోవలం బీచ్, కర్నాటకలోని తిలమతి బీచ్, మహారాష్ట్రలోని నవపూర్ బీచ్, గుజరాత్ లోని డుమస్ బీచ్ లలో ఇలా ఇసుక నల్లగా ఉంటుంది. అయితే మన విశాఖ తీరం నల్లబడిందెందుకో ఇంకా పరిశోధకులు ధృవీకరించాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..