Ugadi Festival : ఉగాది పండుగని ఏయే రాష్ట్రాల వారు ఎలా జరుపుకుంటారో తెలుసా? స్పెషల్ వంటకాలేంటంటే..
భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. అందుకే ఒకే పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో, రకరకాల ఆచారాలతో జరుపుకుంటారు. ఉగాది పండుగ తెలుగు వారికే కాకుండా, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల వారికి కూడా నూతన సంవత్సరం. ఖగోళ శాస్త్రం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయాన్ని ఈ పండుగగా జరుపుకుంటారు. రాష్ట్రాల వారీగా ఈ పండుగను జరుపుకునే తీరు ఇక్కడ ఉంది.

1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (ఉగాది):
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ పండుగ ప్రత్యేకత షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తాయి. తెలుగు వారి ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక పదార్థం మాత్రమే కాదు, జీవిత సత్యాన్ని తెలిపే ఒక సందేశం. ఆరు రకాల రుచులు జీవితంలోని ఆరు భావోద్వేగాలకు ప్రతీక.
తీపి (బెల్లం): ఆనందం, సుఖానికి చిహ్నం.
చేదు (వేపపువ్వు): జీవితంలో ఎదురయ్యే బాధలు లేదా సవాళ్లకు ప్రతీక.
పులుపు (చింతపండు): నేర్పుగా వ్యవహరించాల్సిన సందర్భాలకు సంకేతం.
ఉప్పు (ఉప్పు): జీవితానికి అవసరమైన ఉత్సాహం, రుచి.
కారం (పచ్చిమిర్చి/మిరియాలు): ఆగ్రహం లేదా సహనం కోల్పోయే క్షణాలు.
వగరు (మామిడి పిందెలు): కొత్త అనుభవాలు, ఆశ్చర్యకరమైన మార్పులు.
ఉగాది రోజున ప్రజలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి, తలకు నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తారు. ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి ఆకుల తోరణాలు, వేప ఆకులు కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, కొత్త బట్టలు ధరించి పండుగను ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజు సాయంత్రం దేవాలయాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సిద్ధాంతకర్తలు లేదా జ్యోతిష్యులు ఆ సంవత్సరపు ఆదాయ-వ్యయాలు, రాజపూజ్య-అవమానాలు, వర్షపాతం, దేశ భవిష్యత్తును వివరిస్తారు. వ్యక్తిగత రాశి ఫలాలను తెలుసుకోవడానికి ప్రజలు దీనిని ఆసక్తిగా వింటారు.
ఇక ఈ పండుగకు ముఖ్యమైన వంటకం బొబ్బట్లు (వీటినే భక్ష్యాలు లేదా పోలెలు అని కూడా పిలుస్తారు). శనగపప్పు, బెల్లంతో చేసిన పూర్ణాన్ని గోధుమ పిండిలో పెట్టి నెయ్యితో కాల్చి తయారు చేస్తారు. దీనితో పాటు పులిహోర, వడలు వంటి ఇతర రుచికరమైన వంటకాలు కూడా చేస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారికంగా ఉగాది వేడుకలను నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహించి, ఉత్తమ కవులను, కళాకారులను సత్కరిస్తారు. తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పేలా సాహిత్య చర్చలు జరుగుతాయి. ఉగాది అంటే కాలం ఆరంభం. తెలుగు ప్రజలు ఈ రోజున పాత చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి, కొత్త ఆశలతో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడతారు.
2. కర్ణాటక (యుగాది):
కర్ణాటకలో ఉగాది పండుగను ‘యుగాది’ (Yugadi) అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లాగే కర్ణాటకలో కూడా ఈ పండుగను నూతన సంవత్సరంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే, అక్కడి ఆచార వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘ఉగాది పచ్చడి’ ఎలాగో, కర్ణాటకలో ‘బేవు-బెల్ల’ అంత ప్రాముఖ్యత కలిగినది.
బేవు : అంటే వేప పూత (చేదు – కష్టాలకు చిహ్నం).
బెల్ల : అంటే బెల్లం (తీపి – సుఖాలకు చిహ్నం). వీటితో పాటు మామిడి ముక్కలు, ఉప్పు, మిరియాలు కూడా కలుపుతారు. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ మిశ్రమాన్ని ఒకరికొకరు పంచుకుంటూ తింటారు.
ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి, తలకు నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తారు. ఇంటి గుమ్మాలకు తాజా మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల ముగ్గులతో (రంగోలి) అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి దేవాలయాలను సందర్శిస్తారు. కర్ణాటక యుగాదిలో కొన్ని నోరూరించే వంటకాలు కనిపిస్తాయి. ఓబట్టు : దీనినే ‘హోలిగే’ అని కూడా పిలుస్తారు. ఇవి మన దగ్గర చేసే బొబ్బట్లు/భక్ష్యాలు వంటివి. వీటిని నెయ్యితో కలిపి తింటారు. చింతపండుతో చేసే పులిహోర. పాలు, బెల్లం, పప్పులతో చేసే తీపి పాయస చేస్తారు.
ఇక పోతే, సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పురోహితుల ద్వారా ఆ ఏడాది రాశి ఫలాలు, వర్షపాతం, ఆదాయ-వ్యయాల వివరాలను (పంచాంగం) వింటారు. దీనిని ‘పంచాంగ శ్రవణ’ అని పిలుస్తారు. యుగాది మరుసటి రోజున కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో (ముఖ్యంగా పాత మైసూర్ ప్రాంతంలో) ‘హొస తొడకు’ అనే పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మాంసాహారులు రకరకాల మాంసపు వంటకాలు చేసుకుని విందు ఆరగిస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజున శాకాహారం తీసుకున్న వారు, రెండో రోజు ఇలా మాంసాహారంతో వేడుక చేసుకుంటారు. కర్ణాటకలో యుగాది పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులను స్వాగతిస్తూ, కొత్త ఆశలతో జరుపుకునే ఒక పవిత్రమైన వేడుక.
3. మహారాష్ట్ర (గుడి పడ్వా):
మమహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వా అనే పేరుతో అత్యంత ఉత్సాహంగా, ఒక జైత్రయాత్రలా జరుపుకుంటారు. తెలుగు వారికి ఉగాది ఎలాగో, మరాఠీ ప్రజలకు గుడి పడ్వా నూతన సంవత్సర ఆరంభం. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇంటి ముందు ‘గుడి’ని నిలబెట్టడం ప్రత్యేక ఆకర్షణ. ఒక పొడవైన వెదురు కర్రను తీసుకుని, దానికి చివరన పట్టు వస్త్రం (సాధారణంగా ఆకుపచ్చ లేదా పసుపు రంగు) కడతారు. దానిపై వేప ఆకులు, మామిడి ఆకులు, పూల మాల, గతి (చక్కెరతో చేసిన గాజుల వంటి హారం) అమర్చుతారు. వీటన్నింటిపై ఒక రాగి లేదా వెండి కలశాన్ని బోర్లించి, ఇంటి ముఖద్వారం వద్ద లేదా కిటికీలో అందరికీ కనిపించేలా నిలబెడతారు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ సాధించిన విజయాలకు, చెడుపై మంచి సాధించిన గెలుపుకు (విజయ పతాకం) చిహ్నంగా భావిస్తారు.
ఇక పండగ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి, ఒంటికి నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు (రంగోలి) వేసి, ద్వారాలకు తోరణాలు కడతారు. కొత్త బట్టలు ధరించి పండుగను ప్రారంభిస్తారు. తెలుగు వారి ఉగాది పచ్చడి లాగే, వీరు కూడా వేప ఆకులు, బెల్లం, జీలకర్ర, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తుంది. మహారాష్ట్ర ఇళ్లలో ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన రుచులు కనిపిస్తాయి.
పురాణ్ పోలి (Puran Poli): శనగపప్పు, బెల్లంతో చేసే తీపి బొబ్బట్లు. దీనిని నెయ్యితో కలిపి తింటారు.
శ్రీఖండ్ (Shrikhand): పెరుగుతో చేసే తియ్యని పదార్థం. దీనిని వేడివేడి పూరీలతో కలిపి తీసుకోవడం అక్కడి సంప్రదాయం.
కణగి (Kanagi): కొన్ని ప్రాంతాల్లో తీపి గడ్డల (Sweet Potato) వంటకాలు కూడా చేస్తారు.
మహారాష్ట్రలోని ముంబై, పూణే వంటి నగరాల్లో ఉదయాన్నే భారీ శోభా యాత్రలు నిర్వహిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, తలకు ఫేటా (తలపాగా) చుట్టుకుని, డోల్-తాషా (డప్పులు) వాయిస్తూ యువతీ యువకులు చేసే ప్రదర్శనలు పండుగకు కొత్త కళను తెస్తాయి. మహిళలు నౌవారి (తొమ్మిది గజాల) చీరలు కట్టి బుల్లెట్లపై ర్యాలీలు తీయడం ఇక్కడి ప్రత్యేకత. మహారాష్ట్రలో గుడి పడ్వా అనేది ఒక సాంస్కృతిక గర్వాని, కొత్త ఆశల చిగురుకు ప్రతీక.
4. గోవా (సంవత్సర్ పడ్వో):
గోవాలో కూడా కొంకణి ప్రజలు దీనిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. గోవాలో ఉగాది పండుగను సంవత్సర్ పడ్వో’ (Samvatsar Padvo) అనే పేరుతో చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది కొంకణి ప్రజలకు నూతన సంవత్సరం. మహారాష్ట్రలో జరుపుకునే ‘గుడి పడ్వా’ పద్ధతులకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది.
గోవాలో ప్రతి ఇంటి ముందు ఒక పొడవైన వెదురు కర్రను నిలబెడతారు. దానికి చివరన ఒక రాగి లేదా వెండి కలశాన్ని బోర్లించి, కొత్త పట్టు వస్త్రం, వేప ఆకులు, మామిడి ఆకులు, చక్కెరతో చేసిన గాజుల హారాన్ని కడతారు. దీనిని ‘గుడి’ అని పిలుస్తారు. ఇది విజయానికి, సంక్షేమానికి చిహ్నంగా భావిస్తారు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి, ఒంటికి నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరించి, ఇల్లంతా శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు (రంగోలి) వేస్తారు. స్థానిక దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తెలుగు వారి ‘ఉగాది పచ్చడి’ లాగే, గోవాలో కూడా వేప పూత, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. జీవితంలో వచ్చే కష్టసుఖాలను (చేదు-తీపి) సమానంగా స్వీకరించాలన్నదే దీని అంతరార్థం. గోవాలో ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన శాకాహార వంటకాలు చేస్తారు. పప్పులు, బియ్యంతో చేసే కాన్జీ అని పిలువబడే ఒక రకమైన ఖిచిడీ తయారు చేస్తారు. బంగాళదుంప, పూరి చేస్తారు. శ్రీఖండ్ అని పెరుగుతో చేసే తీపి పదార్థం. మన దగ్గర చేసే బొబ్బట్లు లాంటి తీపి వంటకం పురాణ్ పోలి ఇక్కడ స్పెషల్ వంటకాలు. .
ఇకపోతే, దేవాలయాల్లో, కొన్ని ఇళ్లలో బ్రాహ్మణుల ద్వారా ఆ సంవత్సర ఫలితాలను (రాశి ఫలాలు) వివరించే పంచాంగ పఠనాన్ని వింటారు. దీని ద్వారా రాబోయే ఏడాదిలో తమ అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. మొత్తానికి, గోవాలో ‘సంవత్సర్ పడ్వో’ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకునే ఒక పవిత్రమైన నూతన ప్రారంభం.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పండుగలు నిర్వహిస్తారు. ఉగాది రోజున కాకపోయినా, ఇదే సమయంలో (ఏప్రిల్ నెలలో) మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం జరుపుకుంటారు.
తమిళనాడు: పుత్తాండు (ఏప్రిల్ 14న)
కేరళ: విషు
పంజాబ్: బైశాఖీ
బెంగాల్: పోయిలా బైశాఖ్
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




