AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆపరేషన్ చిరుత చర్మం హంటర్స్ ట్రాకింగ్’ విచారణలో కీలక విషయాలు..!

వన్యప్రాణులను వేటాడకూడదని చట్టాలు చెబుతున్నా.. వేటగాళ్ల ఉచ్చులో ఆ మూగజీవాలు బలవుతూనే ఉన్నాయి. మాంసం, చర్మం, ఇతర అవయవాల కోసం.. జంతువులను వేటాడి మరీ చంపేస్తున్నారు. తాజాగా విశాఖలో పట్టుబడిన చిరుత చర్మంపై ఆరా తీసిన అటవీశాఖ అధికారులకు.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే.. ఒడిస్సా అడవుల్లో చిరుతను వేటాడి చంపి.. అత్యంత పకడ్బందీగా విశాఖ వరకు తరలించినట్టు గుర్తించారు.

'ఆపరేషన్ చిరుత చర్మం హంటర్స్ ట్రాకింగ్' విచారణలో కీలక విషయాలు..!
Tiger Hunters
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 18, 2024 | 6:31 PM

Share

వన్యప్రాణులను వేటాడకూడదని చట్టాలు చెబుతున్నా.. వేటగాళ్ల ఉచ్చులో ఆ మూగజీవాలు బలవుతూనే ఉన్నాయి. మాంసం, చర్మం, ఇతర అవయవాల కోసం.. జంతువులను వేటాడి మరీ చంపేస్తున్నారు. తాజాగా విశాఖలో పట్టుబడిన చిరుత చర్మంపై ఆరా తీసిన అటవీశాఖ అధికారులకు.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే.. ఒడిస్సా అడవుల్లో చిరుతను వేటాడి చంపి.. అత్యంత పకడ్బందీగా విశాఖ వరకు తరలించినట్టు గుర్తించారు. ఇంతకీ ఈ ముఠా ఎలా పనిచేసింది..? అధికారుల ఆపరేషన్ ఎలా సాగింది.?

మార్చి 12.. ఉదయం పదకొండున్నర.. బీచ్ కు సమీపంలోని ఓ గెస్ట్ హౌస్..! డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెంట్ కీలక సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు.. చిరుత చర్మంతో సిద్ధంగా ఉన్నారు. వారికి మరొకరు తోడయ్యాడు. ఇంతలో మరొకడు కలిశాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. డిఆర్ఐ అధికారులు ఆ నలుగురిని పట్టుకున్నారు. వాళ్లు చిరుతని ఎలా వేటారో ఏమోగానీ.. డిఆర్ఐ అధికారులు విసిరిన పంజాకు ఆ స్మగ్లర్లు.. చిక్కక తప్పలేదు. ఆ ముఠాను పట్టుకుని.. వాళ్లు వినియోగించిన కారు బైక్ను సీజ్ చేశారు. చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా విచారించిన డిఆర్ఐ అధికారులు.. ఇద్దరు ఒడిస్సా‎కి చెందిన వాళ్లు కాగా.. మరో ఇద్దరు విశాఖకు చెందిన వాళ్ళుగా గుర్తించారు. దీంతో పట్టుబడ్డ నిందితులతో పాటు.. ఫసీజ్ చేసిన వాటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు డీఆర్ఐ.

కరడుగట్టిన ముఠా పనే..!

ఇక అటవీ శాఖ అధికారులు పని ప్రారంభించారు. డిఎఫ్ఓ అనంత శంకర్, రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ ఆధ్వర్యంలో.. నిందితులను విచారించారు. చిరుత చర్మాన్ని చూసి అటవీశాఖ అధికారులే అవాక్కయ్యారు. ఎందుకంటే.. చిరుత మీసాలు, గోళ్లు, తోక చెక్కు చెదరకుండా చర్మం వలిచే తీరు.. కరడుగట్టిన ముఠాకే తప్ప.. వేరొకరు చేయలేరని అటవీ అధికారుల మాట.

ఇవి కూడా చదవండి

మూడు నెలల క్రితమే వేట..!

ఫారెస్ట్ ఆఫీసర్ల విచారణలో.. నిందితులు తొలుతా నోరు విప్పలేదు. ఆ తర్వాత విచారణ చేసినా పొంతన లేనీ సమాధానాలు చెప్పారు. తమదైన శైలిలో అటవీ అధికారులకు విచారించి అసలు విషయాన్ని కక్కించారు. అయితే.. పట్టుబడిన ఒడిశాకు చెందిన వాళ్ళే చర్మాన్ని విశాఖకి తెచ్చారు. వాళ్ళ గురించి ఆరా తీస్తే.. ఒడిశా కలహాండి జిల్లా కేసింగాకు చెందిన వారుగా గుర్తించారు. సుగ్ధ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ చిరుతను వేటాడారు. దాదాపు మూడు నెలల క్రితమే చిరుతని వేటాడినట్టు గుర్తించ్చారు.

చిరుత వయసు పదేళ్లు..! అత్యంత పకడ్బందీగా..

అక్కడి వేటగాళ్ళ నుంచి కేసింగాకు చెందిన ఇద్దరు చిరుత చర్మాన్ని ఛేజిక్కించుకున్నారు. వారికి విశాఖకు చెందిన మహ్మద్ ఫరూక్.. లక్షల్లో ఆఫర్ చేయడంతో అత్యంత పక్కడబందీగా చిరుత చర్మాన్ని స్మగ్లింగ్ చేసేసారు. రైల్లో అక్కడి నుంచి వచ్చి.. విశాఖలో ఆఫర్ చేసిన వ్యక్తి సూచనతో చిరుత చర్మాన్ని తెచ్చేశారు. ఫరూక్ ఆఫర్ చేయడంతోనే ఒడిశాకు చెందిన ఇద్దరు డబ్బుకోసం ఆశపడి సాహసం చేసినట్టు అటవీ అధికారుల విచారణలో తేలింది. అయితే చిరుత చర్మం కొలతలు బట్టి చుస్తే.. దాని వయసు దాదాపు 10 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. చిరుత చర్మానికి ఉన్న మీసాలు, గోళ్ళు, తోక చెక్కుచెదరకుండా తొలిచే విధానాన్ని చూస్తే.. దీని వెనుక పెద్ద ముఠాయే ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు పురోగతిలో ఉన్నట్టు డిఎఫ్‎ఓ అనంత శంకర్ ప్రకటన విడుదల చేశారు.

కటాకటాల్లోకి స్మగ్లర్లు..

1972 వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. షెడ్యూల్‎లో ఉన్న జంతువు చిరుత. అటువంటి జంతువునే వేటాడి చంపి దాని చర్మాన్ని తొలిచి విశాఖ వరకు రప్పించేశారు ఈ స్మగ్లర్ల ముఠా. ఎట్టకేలకు డిఆర్ఐ అధికారుల నిఘాకు చిక్కారు. నిందితులను అటవీ శాఖ అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. వన్యప్రాణులను సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇదీ ఆపరేషన్ చిరుత చర్మం హంటర్స్ ట్రాకింగ్.. సో ఎంతటి వారైనా వన్య ప్రానులను వేటాడితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..