విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ తీవ్ర రూపం, వ్యాక్సిన్ కొరత.. రెండో డోస్ కోసం జనం ఎదురుచూపులు
Visakha corona : విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ తీవ్ర రూపం దాలుస్తోంది...
Visakha corona : విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బాధితులు పరుగులు తీస్తున్నారు. నిన్న 500 కోవిడ్ కేసులు నమోదవగా, విశాఖలో ఈ 16 రోజుల వ్యవధిలో 5,128 కేసులు వచ్చాయి. గత ఏడాది అక్టోబరు నెల మొత్తానికి 5785 కేసులు మాత్రమే నమోదవడం గమనార్హం. నాటి తీవ్రతను మించి ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మొత్తం కేసుల సంఖ్య దాదాపు 10 వేలకు చేరొచ్చని యంత్రాంగం అంచనా వేస్తోంది. కింగ్ జార్జి ఆసుపత్రి లోని సీఎస్ఆర్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డు బాధితులతో కిక్కిరిసిపోయింది. 500 పడకల వార్డులో ఇప్పటికే 400 మందికి పైగా రోగులు చేరారు. విమ్స్ ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. టీబీ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నా తక్కువ సంఖ్యలో బాధితులు చేరుతున్నారు. దీంతో భారమంతా కేజీహెచ్ కొవిడ్ వార్డుపై పడుతోంది.
అయితే.. టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉండటంతో బాధితులను చేర్చుకోవడం, డిశ్చార్జి సమయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ కొరత ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోడానికి మొదట జిల్లా వాసులు కొంత అనాసక్తి చూపించారు. రాను రాను కేసుల సంఖ్య పెరగటం, కోవిడ్ కారణంగా పలువురు మృత్యువాత పడుతుండటంతో ఇప్పుడు వ్యాక్సిన్ కోసం క్యూకడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4 లక్షల 50 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. దాదాపు లక్ష మంది రెండో డోస్ ను పూర్తి చేసుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన వ్యాక్సిన్ బుధవారం ఒక్కరోజులోనే పూర్తయిపోయింది. దీంతో గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. టీకాను తొలి డోసుగా తీసుకుని, రెండో డోసు పొందేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. రెండో తీసుకునేందుకు సమయం మించిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
Read also : Uddhav : కరోనా విపత్తును ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి ఆదుకోండి.. ప్రధాని మోదీకి సీఎం ఉద్ధవ్ థాకరే లేఖ