విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతం.. మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాలు.. అచితూచి అడుగులేస్తున్న సినీ ప్రముఖులు
విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి మార్మోగుంది.
Vizag steel plant privatisation Agitations : విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి మార్మోగుంది. ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో వినిపించాలని నిర్ణయించాయి. ఈ నెల 15 నుంచి రోజుకో రూపంలో నిరసన తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నిర్ణయించింది. అవసరమైతే అన్ని వర్గాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ, సినిమా ప్రముఖుల మద్దతు తీసుకుని విశాఖ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయ నేతల నుంచి మద్దతు లభిస్తున్నా..? ఏపీ రాజకీయ పార్టీల నుంచి కానీ.. టాలీవుడ్ నుంచి కానీ సరైన మద్దతు రాకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
రాజకీయ పార్టీలు అన్ని కలిసి పోరాటం చేయకపోయినా.. ఏ పార్టీకి ఆ పార్టీ, స్వచ్చంధ సంస్థలు పెద్ద ఏత్తున రోడ్ల పైకి విశాఖ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. అన్ని వర్గాల నేతలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కానీ, టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా నేరుగా విశాఖ ఉద్యమంపై స్పందించిలేదు. ఒక్క నారా రోహిత్ ట్వీట్ తో సరిపెట్టుకుంటే.. తాజాగా చిరంజీవి ఆవేశంతో కూడిన ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా హీరోలెవరు పెద్దగా స్పందించిలేదని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత అన్యాయం జరుగుతోంది. విశాఖ ప్రజలు గొంతు పగిలేలా నినదిస్తున్నారు. అయితే మన తెలుగు సినీ పరిశ్రమకు వినిపించడం లేదు.. కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ తీరుపై కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రమోషనల్ ఈవెంట్ల కోసం విశాఖ వచ్చే సినీ పెద్దలంతా విశాఖకు ఆయువుపట్టులాంటి ఉక్కుకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఇకపై సినీ రంగానికి చెందినవారు ఎవరు విశాఖ వచ్చినా కచ్చితంగా అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు విశాఖ ఉక్కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్ కోసం విశాఖ వచ్చిన మంచు విష్ణును.. స్టీల్ ప్లాంట్ నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు నిరసనకారులు. అయితే.. దీనిపై మంచు విష్ణు స్పందించారు. ప్రైవేట్ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉందని.. అయితే రాజకీయ కారణాల వల్లే వారంతా ముందుకు రాలేకపోతున్నారని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఇకపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే, బీజేపీ పెద్దలను ఎదిరించి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే భయంతోనే సినిమా పెద్దలు ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపలేపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని.. సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు.
Read Also… Mera Ration: కేంద్రం మరో ముందడుగు.. ‘మేరా రేషన్’ యాప్ ఆవిష్కరణ..