AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disneyland: పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌! ఎప్పటి నుంచంటే?

ఒకప్పుడు పిల్లల కేరింతలు, అడ్వెంచర్‌ క్రీడలు, రివర్‌ ఫ్రంట్‌ సందడితో కళకళలాడిన విజయవాడ డిస్నీల్యాండ్‌ మళ్లీ తెరుచుకోనుందా? 57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సిబార్‌ సంస్థతో జరుగుతున్న చర్చల పర్యవసానం ఏమిటి? ప్రస్తుతం ఈ అంశమే విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Disneyland: పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!  ఎప్పటి నుంచంటే?
Vijayawada Disneyland Reopening
M Sivakumar
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 4:59 PM

Share

ఒకప్పుడు సాయంత్రం వేళల్లో పిల్లలు, కుటుంబాలతో ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లింది. కానీ ప్రైవేట్‌ సంస్థలు కార్పొరేషన్‌తో కుదుర్చుకున్న లీజ్‌ గడువు ముగియడం, అనంతరం తలెత్తిన న్యాయపరమైన వివాదాల కారణంగా ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొవిడ్‌ సమయంలో కొన్ని రివర్‌ ఆధారిత క్రీడలు పాక్షికంగా సాగినా, ఆ తర్వాత పూర్తిగా బ్రేక్ పడటంతో డిస్నీల్యాండ్‌ మూతపడింది.

కార్పొరేషన్‌ ఆధీనంలోకి 57 ఎకరాలు

లీజ్‌ వివాదాలు, న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ 57 ఎకరాల భూమి చివరకు కార్పొరేషన్‌ ఆధీనంలోకి వచ్చింది. గతంలో ఇక్కడ మోడ్రన్‌ స్లాటర్‌ హౌస్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చినా, ప్రస్తుతం డిస్నీల్యాండ్‌ను తిరిగి పునఃప్రారంభించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో డిస్నీల్యాండ్‌ను మళ్లీ ప్రారంభించే అంశంపై ప్రభుత్వం సిబార్‌ సంస్థతో చర్చలు మొదలు పెట్టింది. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా ఈ 57 ఎకరాల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో, ప్రభుత్వ స్థాయిలో త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

పేదల ఇళ్ల స్థలాల డిమాండ్‌

ఇదిలా ఉండగా ఇదే స్థలానికి సంబంధించి మరో డిమాండ్‌ కూడా తెరపైకి వస్తోంది. ఎన్నికల హామీల నేపథ్యంలో ఈ భూమిని ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వకుండా, ప్రభుత్వమే లేఅవుట్‌ వేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ స్థలాన్ని పర్యాటక ప్రాజెక్టుకు కేటాయిస్తారా లేక పేదల గృహ నిర్మాణానికి ఉపయోగిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

పర్యాటకానికి కొత్త ఊపు వస్తుందన్న ఆశలు

డిస్నీల్యాండ్‌ పునఃప్రారంభమైతే నగరవాసులకు ఆహ్లాదకరమైన వినోదంతో పాటు, విజయవాడ పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. పర్యాటకం పెరిగితే స్థానిక వ్యాపారాలు విస్తరించి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. పిల్లల కేరింతలు, రివర్‌ ఫ్రంట్‌ సందడి మళ్లీ మొదలవుతాయా ?ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us