బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తు్న్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం, ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల మీదుగా, సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో, ఆగస్టు 29వ తేదీ 2026 అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ;-
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ;-
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు..
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
హెచ్చరికలు (WARNINGS)
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, గంటకు 30 నుండి 40 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
