- Telugu News Photo Gallery Viral photos 90s Rainy Season Childhood Memories: Nostalgic Monsoons in Telugu
90’s Monsoon: వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
వర్షాకాలం అంటేనే ప్రతి ఒక్కరి మనసులో ఏదో తెలియని ఆహ్లాదం, చిన్ననాటి జ్ఞాపకాల పరిమళం. వర్షం కురవడానికి ముందు వీచే చల్లటి గాలి, నేలను తాకిన తొలి చినుకు ఇచ్చే స్వచ్ఛమైన మట్టి సువాసన లేని బాల్యాన్ని ఎవరూ ఊహించుకోలేరు. చిన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పిల్లలందరికీ అదే పెద్ద పండుగ.
Updated on: Aug 27, 2026 | 5:33 PM

ఆనాటి వర్షపు రోజులను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం పడుతుంటే.. "ఇవాళ్టికి స్కూలు వద్దులే ఇంట్లోనే ఉండు" అని ఇంట్లో పెద్దలు చెప్పగానే ఎక్కడలేని సంతోషం కలిగేది.

రోజంతా టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ గడపడం, ఒకవేళ తప్పక స్కూలుకు వెళ్లాల్సి వస్తే కలర్ఫుల్ రెయిన్కోట్లు, గొడుగులు వేసుకుని వెళ్లడం ఎంతో సరదాగా ఉండేది. అప్పుడు సగం క్లాస్ ఖాళీగా ఉండేది. ఇక బడి నుంచి రాగానే ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి నోట్బుక్ పేపర్లతో పడవలు చేసి పారే నీటిలో వదిలేసి సంబరపడేవాళ్లం.

అమ్మ ఎంత అరుస్తున్నా వినకుండా డాబా పైకి వెళ్లి వర్షంలో తడుస్తూ గంతులు వేయడం, డాన్సులు చేయడం ఆనాటి ప్రత్యేకత. ఇప్పుడు రోడ్డుపై వెళ్లేటప్పుడు బురద పడితే ఇబ్బంది పడతాం కానీ, చిన్నప్పుడు అదే బురద నీటిలో ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ ఆడుకున్న రోజులు, వర్షంలో తడుస్తూ ఆడిన క్రికెట్ మ్యాచ్లు వెలకట్టలేనివి.

చెట్ల ఆకులపై నిలిచిన వర్షపు తుంపర్లను స్నేహితులపై జల్లడం, వర్షంలో సైకిల్ రేసులు పెట్టుకోవడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఆ రోజుల్లో చిన్న వర్షం పడినా వెంటనే కరెంట్ పోయేది. ఇంట్లో కొవ్వొత్తి లేదా లాంతరు వెలిగించుకుని, బయట పడే వాన చప్పుడును వింటూ అందరం ఒకేచోట కూర్చుని భోజనం చేయడం ఒక అద్భుతమైన అనుభూతి.

వర్షంలో తడిసి జలుబు చేసినప్పుడు అమ్మ పెట్టే ముద్దుల తిట్లు, ఆ తర్వాత కరకరలాడేలా వేసిచ్చే వేడివేడి ఉల్లిపాయ పకోడీల రుచిని జీవితంలో ఎవరూ మర్చిపోలేరు. ఎంత వయసొచ్చినా వర్షాకాలం తెచ్చే ఈ మధురమైన బాల్యపు జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి!
