ఐఏఎస్ కలలు మీవి… కోట్లు వాళ్లవి… కోచింగ్ సెంటర్లు కావు.. కార్పొరేట్ సంస్థలు

10-11 లక్షల మంది అభ్యర్థులు... ఏళ్ల తరబడి సాగే మహా యజ్ఞం... దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు... ఏటా సుమారు రూ.3 వేల కోట్ల బిజినెస్..భర్తీ చేసే పోస్టులు మాత్రం కేవలం 1000 నుంచి 1100. ఇదంతా ఏటా దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల గురించే.

ఐఏఎస్ కలలు మీవి... కోట్లు వాళ్లవి... కోచింగ్ సెంటర్లు కావు.. కార్పొరేట్ సంస్థలు
యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు (SOURCE:ANI)
Follow us

|

Updated on: May 20, 2024 | 11:39 AM

సివిల్స్…ఈ పేరు వింటనే…గూస్ బంప్స్ వస్తాయి. ఇక IAS సాధిస్తే… అంతకు మించిన సక్సెస్సే లేదన్న రేంజ్‌లో ఉంటాయి సెలబ్రేషన్స్. రిజల్ట్స్ వచ్చిన రెండు మూడు రోజులు ఏ మీడియాలో చూసినా విజేతల కథనాలు… వాళ్ల ఇంటర్వ్యూలే. ఎలా చదివారు.. ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు.. ఎలా సక్సెస్ సాధించారు.. ఇలా ప్రతి ఒక్కరి విజయగాధల్ని ప్రతి అక్షరంలోనూ వివరించే ప్రయత్నం చేస్తారు రాసేవాళ్లు. ఇక వారిపై కురిసే ప్రశంసల గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన పని కూడా లేదు.

ఇదంతా ఇప్పుడెందుకు డిస్కస్ చెయ్యాల్సి వస్తోందంటే.. ఈ ఏడాదికి సివిల్స్ పరీక్షకు అప్లై చేసిన వాళ్లంతా మరో ఆరు రోజుల్లో అంటే మే 26 తేదీన జరగబోయే ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు . అందుకే ఈ విషయాన్ని చర్చించేందుకు ఇదే సరైన సమయం.

ఆ ఒక్క సక్సెస్… ఆ ఒక్కరి జీవితాల్ని మార్చేయవచ్చు… కానీ మిగిలిన లక్షలాది మంది ఫెల్యూర్స్‌ సంగతేంటి..? కేవలం 0.2 శాతం సక్సెస్ రేటును ఆశగా చూపించి లక్షలాది మంది నుంచి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్న కోచింగ్ సెంటర్ల మాటేంటి?

ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు

ఈ ఏడాది సివిల్ సర్వీసెస్‌లో యూపీఎస్సీ భర్తీ చేస్తున్న ఖాళీలెన్నో తెలుసా..? అక్షరాలా 1056… అందులో వైకల్యంతో ఉన్న వారికోసం రిజర్వ్ చేసిన సంఖ్య 40. ఈ పరీక్షలకోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య సుమారు 10 నుంచి 11 లక్షలు. అంటే 11 లక్షల మంది అభ్యర్థులు 1156 పోస్టుల కోసం చేసే అతి పెద్ద యుద్ధం ఇది. ఈ పరీక్షల్లో సక్సెస్ రేటు సుమారు 0.2 శాతం. అంటే ప్రతి వెయ్యి మంది అభ్యర్థుల్లో చివరకు విజయం సాధించే వారి సంఖ్య కేవలం 2.

2023లో భర్తీ చేసిన పోస్టుల సంఖ్య

2023లో భర్తీ చేసిన పోస్టుల సంఖ్య

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. కేవలం 0.2 శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉన్న ఈ పరీక్ష కోసం దేశంలో ఉన్న చిన్న చితకా ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల సంఖ్య లెక్కపెడితే అసలిసిపోయేంత… కాదంటే చెప్పలేనంత. సరే… ఆ నెంబర్ గురించి పక్కన పెట్టేసినా.. అవి ఏటా చేసే బిజినెస్ గురించి మాత్రం పక్కాగా లెక్కలు చూపిస్తోంది గూగులమ్మ. ఆ లెక్కల ప్రకారం ఏటా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు చేస్తున్న బిజినెస్ సుమారు 3 వేల కోట్లు.

హైదరాబాద్‌లో అశోక్ నగర్, ఢిల్లీలో కరోల్ బాగ్, ముఖర్జీనగర్, లక్ష్మీనగర్.. ఈ పేర్లు తెలుగు వాళ్లకు కొత్తేం కాదు. మరీ ముఖ్యంగా సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు రద్దీగా ఉండే ఆ రోడ్లు.. ఎటు చూసినా మిమ్మల్ని కలెక్టర్లను చేస్తామంటూ కనిపించే బోర్డులు… ఆ పక్కనే గుట్టలు గుట్టలుగా పోసి అమ్మే మెటీరియల్ పుస్తకాలు… వీటన్నింటినీ నడుమ.. కొత్త స్టూడెంట్ ఎవరు కనిపించినా.. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ మా కోచింగ్ సెంటర్లో చేరండి… సీట్లు పరిమితం… 70 శాతం డిస్కౌంట్ 80 శాతం డిస్కౌంట్.. ఒక్కసారి మా ఆఫీసుకి రండి… అసలు విషయం మీకే అర్థమవుతుందంటూ బట్టల మార్కెట్లలలో కనిపించే షాప్ కీపర్లలా కోచింగ్ సెంటర్ల ఏజెంట్లూ మీ వెంట పడుతునే ఉంటారు. ఈ సీజన్‌లో అయితే చెప్పాల్సిన పనే లేదు. వాళ్ల మాటలు విన్న ఎవ్వరైనా సరే… రోడ్డు దిగక ముందే కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నట్టు కలలు కనేయచ్చు.

3 వేల కోట్ల మార్కెట్‌కి తొలి మార్కెటింగ్ ఏజెంట్ ఆ వ్యక్తి. పేరుకు అత్యున్నత ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ల మార్కెట్టే అయినా… దానికి ఒక దారీ, తెన్నూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం చేసే జిమ్మిక్కులన్నీ ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు కూడా చేస్తున్నాయి. సేమ్.. రూల్.. సేమ్ స్ట్రాటజీ. కేవలం 0.2 శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉండే ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లు చేసే గారడీ.

పదేళ్లుగా పెరగని పోస్టుల సంఖ్య 

కారణాలు ఏవైనా కావచ్చు… గడిచిన పదేళ్లలో యూపీఎస్సీ భర్తీ చేసే పోస్టుల సంఖ్య దాదాపు అలాగే ఉంది. ఉదాహరణకు 2012లో 1091 పోస్టులను భర్తీ చేస్తే 2024 సుమారు 1156 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ అప్పటికీ ఇప్పటీకీ ఆ ఉద్యోగాల కోసం పోటీ పడే వారి సంఖ్య దాదాపు 100 రెట్లు పెరిగింది. 2012లో సుమారు 5 లక్షల మంది పోటీ పడితే ఇప్పుడు సుమారు 10 నుంచి 11 లక్షల మంది పోటీ పడుతున్నారు.

ఏటా భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు

USPC

ఢిల్లీ,హైదారాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, సహా ఇతర నగరాల్లో ఏటా ప్రతి కోచింగ్ సెంటర్ సగటున కనీసం 10 నుంచి 15 వేల మందికి కోచింగ్ ఇస్తూ ఉంటాయి. ఢిల్లీలోని పెద్ద పెద్ద పేరున్న కోచింగ్ సెంటర్లయితే ఏటా 20-30 వేల మందికి కూడా కోచింగ్ ఇస్తుంటాయి. కానీ వాళ్ల ఇనిస్టిట్యూట్‌ నుంచి సెలక్టయ్యే అభ్యర్థుల సంఖ్య 10 నుంచి 20 మంది మించి ఉండదు. మరి మిగిలిన వేలాది మంది పరిస్థితి ఏంటి..? అయితే వాళ్ల వైఫల్యాలను పూర్తిగా కప్పెట్టేస్తాయి ఈ సంస్థలు. డబ్బు పెట్టగల్గిన వాళ్లు మళ్లీ మరో ఏడాది కోచింగ్‌లో చేరుతారు. నిజానికి సివిల్స్ కొట్టాలన్నది ఒక వ్యసనంలాంటిదే. ఒక సారి ప్రిపరేషన్ మొదలు పెట్టాక… వయసు గడువు ముగిసేంత వరకు యుద్ధాలు చేస్తూనే ఉంటారు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ ముగిసేసరికి దాదాపు ఏడాది పడుతుంది. అభ్యర్థులు ఎన్నేళ్లు అక్కడే ఉండి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతారన్నది వారికున్న ఆర్థిక స్థోమత … పట్టుదలపై ఆధారపడి ఉంటాయి. కొందరు మొదటి ప్రయత్నంలోనే జాబ్ కొట్టొచ్చు. కానీ అలాంటి వారి సంఖ్య సింగిల్‌ డిజిట్‌లో ఉంటుంది. ఒక వేళ వాళ్లు సాధించినా కనీసం పదేళ్ల క్రమం తప్పని శ్రమ, ప్లానింగ్ ఆ విజయంలో ఉండొచ్చు. కానీ మిగిలిన వారికి రెండేళ్లు, మూడేళ్లు.. పదేళ్లు పట్టిన వాళ్లు కూడా హైదరాబాద్‌ అశోక్ నగర్లో, ఢిల్లీ ముఖర్జీనగర్, కరోల్‌బాగ్‌ వీధుల్లో కనిపిస్తుంటారు. అప్పటికీ సాధించలేని వాళ్లు.. కొద్ది రోజుల క్రితం విడుదలైన 12th ఫెయిల్ సినిమాలో గుడ్డూ భయ్యాలా టీ స్టాల్ పెట్టుకొని జూనియర్లకు గైడెన్స్ ఇవ్వొచ్చు. మనోజ్ శర్మలా ఇంకేదైనా ప్రైవేటు ఉద్యోగంలో స్థిరపడొచ్చు. లేదా అదే ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగానో, లేదా అడ్మిన్ విభాగంలోనే లేదా మరి కొందరు ఇంగ్లిష్ నోట్స్‌ను హిందీలోకి తర్జుమా చేసే ట్రాన్సలేటర్లుగానో కూడా స్ధిరపడుతున్నారు. ఇంకొందరు మాత్రం సివిల్స్ కాకపోయినా వారి వారి స్వరాష్ట్రాల్లో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణులై చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్న వాళ్లు లేకపోలేదు. సమస్య ఏంటంటే… వాస్తవాన్ని అటు అభ్యర్థులు గుర్తించడం లేదు.. కోచింగ్ సెంటర్లు అస్సలే చెప్పవు.

కోచింగ్ సెంటర్ల తప్పుడు ప్రకటనలు

కోచింగ్ సెంటర్ల తప్పుడు ప్రకటనలు

మరో విషయం తెలుగు రాష్ట్రాల జనాలకు మన కార్పొరేట్ కాలేజీలిచ్చే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ల గురించి బాగానే తెలుసు. కానీ ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు కూడా ఫుల్ పేజ్ యాడ్స్‌ ఇచ్చే రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఫేక్ ప్రకటనలివ్వడంలో పోటీ పడుతున్నాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డబ్బులు ఆశ చూపించి వారితో కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. దీంతో గత ఏడాది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ CCPA ఏకంగా ఢిల్లీలోని 20 ప్రముఖ కోచింగ్ సెంటర్లకు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారంటూ నోటీసులు పంపింది. అలాగే కేంద్ర విద్యా శాఖ కూడా ఎంపికైన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కోచింగ్ సెంటర్లతో ఎలాంటి కాంట్రాక్టులు కుదుర్చుకోకూడదని వార్నింగ్ ఇచ్చింది .

ఢిల్లీలో, హైదరాబాద్‌ సహా ఇతర ప్రముఖ నగరాల్లో ఒకప్పుడు చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉండే కోచింగ్ సెంటర్లు గడిచిన పదేళ్ల కాలంలో కార్పొరేట్ స్థాయికి ఎదిగిపోయాయి. అక్కడ కేవలం పాఠాలు చెప్పే సార్లు మాత్రమే ఉండరు. ఎంబీఏ గ్రాడ్యూట్లు, హెచ్ఆర్ మేనేజర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఐటీ ఉద్యోగులు, మీడియా టెక్కీలు.. ఒక్క విభాగం కాదు.. కేవలం ఐఏఎస్‌కి కోచింగ్ ఇచ్చే సెంటర్లలో ఇప్పుడు అన్ని విభాగాలకు చెందిన వారు పని చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడవి కోచింగ్ సెంటర్లు కాదు… కార్పొరేట్‌ను తలదన్నే ఇనిస్టిట్యూట్స్. అందులో పని చేసే వారికీ టార్గెట్లుంటాయి. లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.

ఇంత పెద్ద వ్యవస్థను పర్యవేక్షించేదెవరు..? నిన్న మొన్నటి వరకు వాళ్లు చెప్పిందే వేదంలా నడిచింది. కానీ గడిచిన రెండేళ్లలో కోచింగ్ సెంటర్ల వల్ల పెరుగుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. వారికి కొన్ని నియమ నిబంధలను ఏర్పాటు చేసేందుకు ఓ అడ్వైజరీని కూడా విడుదల చేసింది. గైడ్ లైన్స్‌కి సంబంధించి కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. సో.. మొత్తంగా ఈ సో.. కాల్డ్ కోచింగ్ సెంటర్లు ఇప్పుడిప్పుడే సర్కారు రాడార్లోకి వస్తున్నాయి.

ఫ్యాకల్టీకీ కోట్లలో వేతనాలు

కేవలం పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్స్, పెద్ద పెద్ద హోర్డింగులు, సోషల్ మీడియా ప్రచారాలు మాత్రమే కాదు.. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో కూడా కోట్లలలో కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. దేశంలో ప్రముఖ కోచింగ్ సెంటర్లలో సివిల్స్ కోచింగ్ ఫీజు సుమారు లక్ష 50 వేల నుంచి 2 లక్షల వరకూ ఉంటోంది. అందుకే కేవలం వారానికోసారి ఒ గంట మెంటార్ షిప్ చేసే గెస్ట్ లెక్చరర్‌కి కూడా లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నాయి. ఇక స్టార్ టీచర్లకైతే ఏటా కోట్లలో వేతనాలుంటున్నాయి. వారితో పాటు సక్సెస్ అభ్యర్థుల్ని కూడా కొనేయడం ఈ మార్కెట్లోని కామన్. ఐఏఎస్ పాసయ్యాం కదా అని.. అభ్యర్థులు చేతులు ముడుచుకొని కూర్చోవడం లేదు… తమ కోచింగ్ సెంటర్లో చదవలేదు కదా అని విలువ పాటించేంత ఆలోచన కోచింగ్ ఇచ్చేవారికి ఉండటం లేదు. జస్ట్ మనీ మేటర్స్. అందుకే టాపర్స్‌ని గంప గుత్తగా కొనేయడం కూడా సర్వ సాధారణం ఇక్కడ. అయితే ఇది పాసైన వారి అందరి విషయంలో ఇలాగే జరగకపోవచ్చు.

యూపీఎస్సీ కార్యాలయం ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు (SOURCE:ANI)

యూపీఎస్సీ కార్యాలయం ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు (SOURCE:ANI)

కోవిడ్ తర్వాత ఆన్ లైన్ మార్కెట్‌ను ఈ కోచింగ్ సెంటర్లు ఒడిసిపట్టాయి. దీంతో దేశంలో మారు మూల పల్లెల్లోకి కూడా ఢిల్లీ కోచింగ్ సెంటర్లు చొచ్చుకెళ్లిపోయాయి. ఫీజులు తక్కువగా ఉండటంతో అభ్యర్థులు కూడా బాగానే చేరుతున్నారు. స్టడీ మెటీరియల్, టీచింగ్ స్టాఫ్, ఎస్టాబ్లిష్మెంట్, క్లాస్ రూమ్స్ కోసం పెట్టే ఖర్చు తగ్గడంతో కోచింగ్ సెంటర్లు కూడా ఫీజు విషయంలో పెద్దగా పట్టుబడటం లేదు.

అయితే ఇంత గందరగోళంలోనూ కాస్త ఊరట కల్గించే విషయం కూడా ఉంది. ఈ పేరున్న కోచింగ్ సెంటర్లను బేస్ చేసుకొని చుట్టూ చాలా పెద్ద మార్కెట్ జరుగుతోంది. అభ్యర్థులకు కావాల్సిన మెటీరియల్‌ అందించే పుస్తకాల వ్యాపారం, హోటళ్లు, హాస్టళ్లు, పీజీ సెంటర్లు, షాపింగ్ మాల్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు, ఇలా ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఏటా వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. వాటితో పాటు సివిల్స్ లక్ష్యంగా వచ్చిన చివరకు సాధించలేక.. వయసు మీరిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోలేక.. అక్కడే ఆ సివిల్స్ పరీక్షల కోసం జరిగే ఈ కార్పొరేట్ వ్యాపారంలోనే ఏదో రకంగా ఉపాధిని వెతుక్కుంటూ కలల్ని చంపేసుకొని సర్దుకుపోతున్నారు.

ఇక్కడ సివిల్స్ లక్ష్యం ఉండటం తప్పు కాదు… కచ్చితంగా ఉండి తీరాల్సిందే. కానీ లక్ష్యం నిర్ధేశించుకునే ముందే వాస్తవ పరిస్థితిపై అభ్యర్థులు ఓ అంచనాకు రావాలి. లక్ష్యం చిన్నప్పటి నుంచే పెట్టుకుంటే అందుకు అనుగుణంగా 8-9 తరగతుల నుంచే ప్లాన్ ప్రకారం చదవటం మొదలు పెట్టాలి. మనం సాధారణంగా విజేతల గాథల్నే వింటూ ఉంటాం. కానీ వాళ్లెవ్వరూ ఒక్క పరాజయం కూడా ఎదుర్కొకుండా విజేతగా నిలిచి ఉండరు. ఆ పరాజయాల్ని దాటుకొచ్చిన మార్గాన్ని, వారు చూపించిన పట్టుదలని, వారు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల్ని, వాటి నుంచి వారు బయటపడిన విధానాన్ని మనం గుర్తించేంత లోతైన పరీశీలన చెయ్యం. నిజానికి సివిల్స్… ముందే చెప్పినట్టు సుదీర్ఘ ప్రక్రియ, దాని కోసం కేవలం డబ్బులు మాత్రమే కాదు.. ఏళ్ల తరబడి కాలాన్ని కూడా వెచ్చించాలి. ఒక వేళ సెలక్ట్ కాకపోతే.. వాట్ నెక్ట్స్ అన్న ప్రణాళిక అంటే ప్లాన్ బి కూడా మీ దగ్గర ఉండాలి. అన్నింటికీ మించీ కోచింగ్ సెంటర్ల మాటల, ప్రకటనల మాయాజాలంలో చిక్కుకోకుండా వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూనే అడుగులు ముందుకు వెయ్యాలి. ఈ దేశంలో ఐఏఎస్ అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగమే. అందుకే అంత క్రేజ్ ఆ ఉద్యోగాలకి. జనంలో ఉన్న క్రేజ్‌నే నమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ.. కోట్లు గడిస్తున్నారు. ఎవరు సక్సెస్ అయినా కాకపోయినా వాళ్లు మాత్రం సక్సెస్ అవుతున్నారు.