Mangalagiri: మంగళగిరి పానకాల స్వామి సన్నిధిలో వింతలు

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి. ఎంతో పురాతనమైన, చారిత్రక ఆలయం అబ్బుర పరుస్తుంది‌. ఆలయం సమీపంలో ఉన్న పెద్ద కోనేరు చాలా ప్రత్యేకం. చీకటి కోనేరుగా పిలిచే ఈ కోనేరు కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది. మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్ధేశంతో ఆరు నెలల క్రితమే పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు.

Mangalagiri: మంగళగిరి పానకాల స్వామి సన్నిధిలో వింతలు
Tunnel
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 18, 2023 | 9:54 PM

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం.. ఏపీలోనే అత్యంత ఎత్తైన రాజగోపురం ఉన్న ఆలయం. ఈ కోవెలను పాండవులు నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో ఆలయ అభివృద్ధి పనులు జరిగాయి. అనంతరం సదాశివరాయల కాలంలో ఆలయ పరిసరాల రూపురేఖలు మారిపోయినట్టు శిలాశాసనాలు చెప్తున్నాయి. సదాశివరాయల మేనల్లుడైన రాజయ్య.. ఆలయానికి దక్షిణ భాగంలో పెద్ద కోనేరు నిర్మించారు. 464 ఏళ్ల క్రితం ఆ కోనేటిని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. 1970 వరకూ ఈ కోనేటిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేవారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించేవారు. అయితే కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఈ కోనేరు ఒక డంపింగ్ యార్డుగా మారిపోయింది. ఈ కోనేటి నిర్మాణాలు కూలిపోయాయి. 1832లో కరువు సంభవించి కోనేరు పూర్తిగా ఎండిపోవడంతో కోనేటిలో కర్నాటకుకు చెందిన పదివేల తుపాకులు, ఫిరంగి గుండ్లు లభించాయని బ్రిటీషర్లు రికార్డుల్లో ఉంది. ఈ కోనేటిని శుభ్రం చేయాలని 1994లో ఒకసారి ఓఎన్జీసీ సాయంతో కొంతమంది ప్రయత్నించారు. అయితే నీరు పెద్ద ఎత్తున చేరుతుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆ కోనేరును అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కేతో పాటు ఆలయ అధికారులు.

ఒక్కో అడుగు నీరు తోడేకొద్దీ.. ఒక్కో ఆసక్తికర కట్టడం బయటపడుతోంది. మొదట ఆంజనేయ స్వామి ఆలయం వెలుగు చూసింది. ఆలయం ఎదుట ధ్వజ స్తంభం కూడా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహం కూడా బయటపడ్డాయి. తూర్పు మెట్లపై శివలింగాకారాలు వెలుగు చూశాయి.  మరింత దిగువకు వెళ్తే.. 120 అడుగుల లోతులో భారీ సొరంగం బయటపడింది. 5 అడుగుల వెడల్పుతో ఉన్న సొరంగం అది. ఈ సొరంగం చేబ్రోలు బ్రహ్మగుడి వరకూ ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఈ సొరంగంలోని బురదతో పాటు నీటిని తొలగిస్తున్నారు. పూర్తి స్థాయిలో బురదను తొలగించిన తర్వాత.. సొరంగం లోపల ఏముంది.. ఎక్కడ వరకూ వెళ్ళవచ్చు అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు పానకాల స్వామి ఆలయ అధికారులు.

120 అడుగుల వరకూ నీటిని తోడి పూడిక తీశారు. అయితే కోనేరు చతుర్భుజా, షడ్బుజా అనేది అర్థం కావటం లేదు. కానీ భక్తులు మాత్రం శ్రీ చక్రం ఆకారంలో కోనేరును నిర్మించారని చెబుతున్నారు. ఇది ప్రత్యేక నిర్మాణం అనీ.. అవుట్ లేదా ఇన్ లెట్ అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ ప్రకటించారు. సాంకేతికంగా ఈ నిర్మాణం ఏంటి అన్న అంశాన్ని తేల్చే పనిలో పడ్డారు. ఆ కోనేరులో ఉన్న సొరంగం ఎక్కడి వరకు ఉంది? ఎందుకు నిర్మించారనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే స్వామివారి వైదిక కార్యక్రమాలతో పాటు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు ఆలయ అధికారులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..