Andhra Pradesh: అయ్యో పాపం ఎంత ఘోరం.. విష జ్వరానికి చిన్నారి విద్యార్థిని బలి..
మేఘన మృతితో గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల వచ్చిన పదవ తరగతి పరీక్షల్లో మేఘన ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులు తెచ్చుకుంది. కాలేజీలు తెరవగానే ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే విషజ్వరంతో మృతి చెందటం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అందరితో కలివిడిగా ఉండే మేఘన మరణం స్థానికులను సైతం విషాదంలో ముంచింది.

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని మెట్టవలసలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక కుడుమూరు మేఘన(14), పదవ తరగతి విద్యార్థిని విషజ్వరానికి గురై తుది శ్వాస విడిచింది. రెండు రోజులుగా ఆమె తల్లి సంధ్య మరియు తమ్ముడు మహేంద్ర జ్వరంతో బాధపడుతుండగా, సోమవారం ఉదయం మేఘనకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. వెంటనే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి చికిత్స అందించారు. రక్తపరీక్షల్లో మలేరియా, పచ్చకామెర్లు సోకినట్టు తేలింది. అప్పటికే మందులు కూడా వాడినప్పటికీ మేఘన ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో విజయనగరానికి రిఫర్ చేశారు.
అయితే విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన మేఘన ఒక్కరోజులోనే జ్వరంతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మేఘన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మృతురాలి తమ్ముడు మహేంద్ర ఏడవ తరగతి చదువుతుండగా, అక్క నర్సు శిక్షణ పొందుతోంది. మేఘన మృతితో గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల లోపం, నాణ్యమైన వైద్య సేవలపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేఘన మృతితో గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల వచ్చిన పదవ తరగతి పరీక్షల్లో మేఘన ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులు తెచ్చుకుంది. కాలేజీలు తెరవగానే ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే విషజ్వరంతో మృతి చెందటం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అందరితో కలివిడిగా ఉండే మేఘన మరణం స్థానికులను సైతం విషాదంలో ముంచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..