Tirumala: చిరుత సంచారంతో అలర్టైన టీటీడీ.. రాత్రి 10 గంటలకే అలిపిరి నడక మార్గం మూసివేత..

|

Jun 24, 2023 | 4:25 AM

తిరుమల అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు.

Tirumala: చిరుత సంచారంతో అలర్టైన టీటీడీ..  రాత్రి 10 గంటలకే అలిపిరి నడక మార్గం మూసివేత..
Tirupati Alipiri Walk Way
Follow us on

తిరుమల అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద గురువారం రాత్రి 5 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పరిశీలించి, కీలక నిర్ణయాలు ప్రకటించారు. పిల్ల చిరుత దాడి చేసిందని, దీంతోనే బాలుడికి ప్రాణాపాయం తప్పిందని ఆయన అన్నారు. దాడి జరిగినప్పుడు భక్తులు, భద్రతా సిబ్బంది పెద్దగా అరవడం, రిపీటర్‌ స్టేషన్‌ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసిందన్నారు. అయితే, టీటీడీ అటవీశాఖ ఆఫీసర్లు చిరుత సంచారాన్ని గుర్తించారని తెలిపారు. అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు సంచరిస్తున్నట్టుగా తెలిసిందని ఈవో ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయాలు ప్రకటించిన ఈవో.. రాత్రి 7గంటల తర్వాత 200 మంది భక్తులను ఒక టీంలా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ టీంతోపాటు సెక్యూరిటీగార్డు ఉంటారని, భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ తిరుమల చేరుకోవాలని ఆయన అన్నారు. చిన్నపిల్లలు మధ్యలో ఉండేలా చూసుకోవాలని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బందికి సూచించారు.

చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం ట్రాప్‌ కెమెరాలు కూడా సిద్ధం చేశారని చెప్పారు. ఇక భక్తులను శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6గంటల వరకు అనుమతిస్తామని అన్నారు. అలాగే అలిపిరి నడక మార్గంలో రాత్రి 10గంటల వరకు ఎంట్రీ ఉంటుందని, ఆ తర్వాత ఆ దారిని మూసేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే, సాయంత్రం 6గంటల తర్వాత ఘాట్‌రోడ్లపై వెళ్లే వాహన దారుల భద్రతకు కూడా పలు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. చిరుత దాడిలో గాయపడిన బాలుడు శ్రీవారి అనుగ్రహంతో కోలుకుంటున్నాడని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..