Organic Laddu Prasadam: తిరుమలలో కొత్త ఆచారానికి అధికారుల శ్రీకారం.. శ్రీవారికి ప్రకృతి సిద్ధ వంటకాలతో నైవేద్యం..!

శ్రీవారికి ప్రకృతి సిద్ధంగా పండించిన పదార్దాలతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

Organic Laddu Prasadam: తిరుమలలో కొత్త ఆచారానికి అధికారుల శ్రీకారం.. శ్రీవారికి ప్రకృతి సిద్ధ వంటకాలతో నైవేద్యం..!
Ttd Organic Laddu Prasadam Naivedyam
Follow us
Balaraju Goud

|

Updated on: May 01, 2021 | 4:03 PM

శ్రీవారికి ప్రకృతి సిద్ధంగా పండించిన పదార్దాలతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించారు అర్చకులు. గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యంతో పూర్వకాలంలో శ్రీవారికి నైవేద్యం సమర్పించే వారని చెప్పారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈరోజు నుండి శ్రీవారికి గోఆధారితంగా తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని నివేదించారు.

ఆర్గానిక్‌ ఆహార పదార్ధాలను ప్రోత్సహిస్తూ మొదటి విడతలో అన్నప్రసాదం తయారు చేస్తున్నామనీ టీటీడీ అధికారులు చెబుతున్నారు. గోఆధారిత ప్రసాదం శ్రీవారికి సమర్పించడం టీటీడీలో ఒక చరిత్రగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లోనూ ఈ పరంపరను కొనసాగించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శ రైతులను గుర్తించాలని టీటీడీ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వ్యవసాయంతో తయారైన అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారని టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు.

శ్రీనివాసుడు నైవేద్య ప్రియుడు. అందుకే శ్రీవారి ఆలయంలోని నైవేద్య పోటులో సాంప్రదాయబద్దంగా తయారు చేసిన వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తుంటారు అర్చకులు. శ్రీ‌వారికి నైవేద్య స‌మ‌ర్పణ‌కు రోజుకు 194 కిలోల బియ్యం అవ‌స‌ర‌మ‌వుతుంది. ఆ బియ్యాన్ని పూర్తిగా 365 రోజుల పాటు 365 ర‌కాల బియ్యాన్ని విరాళంగా ఇస్తాన‌ని ముందుకొచ్చారు ప్రకృతి వ్యవ‌సాయవేత్త విజ‌య‌రామ్‌. దీంతో… ఇక‌పై స్వామివారికి నివేదించే నైవేద్య ప్రసాదాల‌ను… పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పండిన బియ్యంతో త‌యారు చేయ‌నున్నారు.

గో ఆధారిత వ్యవసాయ పద్ధతిలో… దేశీయ విత్తనాలతో పండించిన బియ్యంతో శ్రీవారికి నైవేద్యం సమర్పించాలని.. గో వ్యవసాయ మహర్షి విజయ రామ్ ఆలోచనకు, యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ ఛైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు కె శివ కుమార్ కార్యాచరణకు.. టీటీడీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ట్రయల్ రన్‌గా 3 రోజులపాటు నిర్వహిస్తోంది. గో విశిష్టత‌ను స‌మాజానికి తెలిపే కార్యక్రమాల‌ను టీటీడీ చేప‌ట్టడంతో పాటు.. ప్రకృతి సిద్ధమైన నైవేద్య స‌మ‌ర్పణ కార్యక్రమానికి… టీటీడీ శ్రీ‌కారం చుట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్.

ప్రకృతి సిద్ధమైన బియ్యం టీటీడీ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా దొరికితే.. భ‌విష్యత్తులో నైవేద్య ప్రసాదాల‌తో పాటు.. అన్నప్రసాద కేంద్రంలో కూడా.. ఈ బియ్యంతోనే భ‌క్తుల‌కు భోజ‌నం పెట్టేలా… ప్రణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు టీటీడీ అడిష‌న‌ల్‌ ఈవో ధ‌ర్మారెడ్డి. ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పణ ప్రారంభించారు. మొదటి దశలో స్వామి వారికి నైవేద్యం పెట్టే అన్నప్రసాదాలను దేశీ దాన్యంతో తయారు చేస్తున్నామ‌నీ, దశలవారీగా లడ్డూల తయారీ, అన్నదాన భవనంలో ప్రకృతి ఆధారిత వస్తువులను ఉపయోగిస్తామని తిరుమల తిరపతి దేవస్థానం తెలిపింది.

ఇదిలావుంటే, 200 సంవత్సరాల క్రితం బెల్లంతో తయారుచేసిన… శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని, మళ్లీ స్వచ్ఛమైన బెల్లంతో తయారుచేసే ప్రక్రియ ప్రారంభం కావడంపై భక్తకోటి హర్షం వ్యక్తం చేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా భక్తులందరికీ ఈ సనాతన ప్రసాదాన్ని అందించాలని కూడా టీటీడీ భావిస్తోంది. అప్పట్లో గోవిందుడి ఆకలి తీర్చిన గోమాత… మళ్లీ ఇప్పుడు స్వామివారికి స్వచ్చమైన నైవేద్యాన్ని అందించడం గోబంధువులందరికీ గర్వకారణం అంటున్నారు నిర్వాహకులు.

Read Also…  Oxygen Express: తెలంగాణకు ప్రాణ వాయువు… అంగూల్‌ నుండి సికింద్రాబాద్‌కు బయుదేరిన మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌