Gold: కిలో బంగారం రూ.6 లక్షలే.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాక్..
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న ఒక గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది. ఫేక్ గోల్డ్ ముఠా యవ్వారం బయట పడింది. ఏడు మంది ముఠా గా ఏర్పడి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతూ వచ్చిన ముఠా ఎట్టకేలకు దొరికిపోయింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఫేక్ గోల్డ్ ముఠా యవ్వారం గుట్టురట్టయింది. ఏడుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. 2.8 కేజీల నకిలీ బంగారు పూసల దండతో పాటు ఇన్నోవా కారు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసు యంత్రాంగం.. ముఠా మాస్టర్ ప్లాన్‌ను బయటపెట్టింది. వివరాల్లోకెళ్తే.. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పాలెంపల్లికి చెందిన రాన్న చరణ్, రాన్న పండి, వినోద్ కుమార్, రుక్ జాన్, వీరబల్లి మండలం షికారి పాలెంకు చెందిన మల్లన్న, సోమల్ చలపతి, రానా కృష్ణ బాబులు నకిలీ బంగారంతో మోసానికి కుట్ర పన్నారు. పొలంలో జేసీబీతో తవ్వకాల జరిపే సమయంలో బంగారం బయటపడిందని నమ్మించి మోసగించాలనుకున్నారు. నకిలీ బంగారు పూసల దండలను అసలు బంగారంగా చూపించి తక్కువ ధరకు ఇస్తామని చెప్పి బాధితులను నమ్మించి డబ్బు కాజేయాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను రమ్మించే ప్రయత్నం చేశారు. ఈనెల 10న బాధితులకు ఫోన్ చేసి భూమిలో దొరికిన సుమారు మూడు కిలోల బంగారు పూసల దండ తమ వద్ద ఉందని, అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉందని అందుకే తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారు.
డబ్బు అవసరమని కేజీ బంగారు రూ.6 లక్షలకే అమ్ముతామంటూ నమ్మ బలికిన ముఠా మాటలు నమ్మి హైదరాబాద్ కు చెందిన ముగ్గురు డబ్బుతో మదనపల్లికి వచ్చారు. ఈ నెల 17న అన్నమయ్య సర్కిల్ సమీపంలో కలుసుకొని నకిలీ బంగారు పూసల దండ చూపించిన ముఠా అనంతరం వారిని హైవే వైపు ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. ఫేక్ గోల్డ్ మార్పిడికి నిర్మానుష ప్రాంతాన్ని ముఠా ఎంచుకోగా.. ఆశపడి బంగారం కొనేందుకు సిద్ధమైన హైదరాబాద్ వాసులు.. అది ఫేక్ గోల్డ్ గా భావించి వెనక్కి తగ్గారు. కత్తులు చూపించి బెదిరించి నగదు తీసుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మదనపల్లి 2 టౌన్ పిఎస్ లో కేసు నమోదు కాగా సెక్షన్ 318(4), 308(5) r/w3(5)BNS కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను మదనపల్లి రాయచోటి జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా వాహనంతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గతంలోనూ నిందితులు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
