Rayala Cheruvu: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోన్న రాయలచెరువు.. వరుస లీకేజీలు
రాయలచెరువు మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరో మూడు చోట్ల నీరు లీకవుతోంది. ఊట నీరుతోనే చెరువు కట్టకు వరుస లీకేజీలు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది.
రాయలచెరువు మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరో మూడు చోట్ల నీరు లీకవుతోంది. ఊట నీరుతోనే చెరువు కట్టకు వరుస లీకేజీలు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. రాయల చెరువుకు వరుస లీకేజీలతో దిగువన ఉన్న గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. ఎప్పుడు తెగుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు సమీప గ్రామాల ప్రజలు. ఐతే ఆందోళన వద్దని భరోసా ఇస్తోంది అధికార యంత్రాంగం. ఇప్పటికే కట్టకు పడ్డ గుంతను పూడ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిపుణుల సూచనలతో మరమ్మతు పనులు చేపట్టారు ఆఫ్కాన్స్ సంస్థ ఇంజనీర్లు. మూడ్రోజులుగా గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చెరువువద్దకు టన్నుల కొద్దీ బండరాళ్లు, ఇసుక, సిమెంట్ కంకరను తరలించారు. చెరువు మొరవ ప్రాంతంలో లోతుతీసి నీరు బయటకు తరలించేందుకు పొక్లైన్లు పనిచేస్తున్నాయి. అవుట్ ఫ్లో పెంచుతుండటంతో మళ్లీ వర్షాలొచ్చినా ఇబ్బంది లేదని చెబుతున్నారు ఇరిగేషన్ డీఈ వెంకటశివా రెడ్డి. ఈ పనులపై ఏపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు జరిగేలా చూడాలని ఆదేశించింది.
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటీవల తిరుపతి రాయలచెరువును పరిశీలించారు. చెరువు పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న చంద్రబాబు… అవసరమైతే ఐఐటీ నిపుణులతో దీని భద్రతను అంచనా వేయించాలన్నారు. ఈ చెరువు భద్రతపై ప్రజల్లో అనేక ఆందోళనలు ఉన్నాయని.. ఆ ఆందోళనలు తొలగించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
Also Read: Mohan Babu: కృష్ణా జిల్లాలో మోహన్ బాబు పర్యటన.. సీఎం జగన్‌ను కలిసే అవకాశం