AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: పరకామణిలో చోరీపై ఏపీలో దుమ్ముదుమారం.. చంద్రబాబు సర్కార్ సీరియస్.. అమిత్‌షాకు వైసీపీ లేఖ..

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్‌ ఇండియా లెవల్‌ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్‌. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేస్తోంది.

Tirumala: పరకామణిలో చోరీపై ఏపీలో దుమ్ముదుమారం.. చంద్రబాబు సర్కార్ సీరియస్.. అమిత్‌షాకు వైసీపీ లేఖ..
Tirumala News
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 23, 2025 | 11:44 AM

Share

తిరుమల పరకామణి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారాలోకేష్‌ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్‌ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్‌చాట్‌లో చెప్పారు. దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని..సిట్‌ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలు తేలుస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ అండ్‌ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని.. అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని వ్యాఖ్యానించారు లోకేష్‌.

శ్రీవారి సొమ్మును దోచుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా రాజీ కుదుర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అధికార కూటమి నేతలు. రవికుమార్‌ వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారని భావిస్తున్న ప్రభుత్వం..సిట్‌ విచారణతో వారి బండారాన్ని బయటపెడతామని చెబుతోంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెబుతున్నారు. 20 ఏళ్లుగా రవికుమార్‌ పరకామణిలో చోరీ చేస్తున్నాడని.. అప్పుడు రవికుమార్‌ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై దమ్ముంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ ఆంశంలో..కేంద్ర జోక్యం కోరుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. హిందువుల విశ్వాసాన్ని కాపాడడానికి పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించబడినట్టు కనిపిస్తోందని లేఖలో ఆరోపించారు వైసీపీ ఎంపీ. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని..విశ్వసనీయమైన ఆధారాలతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలన్న అభిప్రాయాన్ని లేఖలో వ్యక్తం చేశారు.

అలాగే తిరుమల పరకామణి వివాదంపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశారు గురుమూర్తి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.120 కోట్ల హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఈ వ్యవహారంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..