AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అయ్యో భాస్కర్.. మళ్లీ పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్.. ఆందోళనలో అధికారులు..

బుసలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు.. విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు.. అతడే పాముల భాస్కర్‌గా గుర్తింపు పొందిన భాస్కర్‌నాయుడు. ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురయి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్‌నాయుడు.. మరోసారి పాముకాటుకు గురయి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు టీటీడీ అధికారులు.

Tirumala: అయ్యో భాస్కర్.. మళ్లీ పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్.. ఆందోళనలో అధికారులు..
Tirumala Snake Catcher Bhaskar Naidu
Raju M P R
| Edited By: |

Updated on: Jun 29, 2025 | 9:20 AM

Share

ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్‌ నాయుడు.. స్నేక్ క్యాచర్‌గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం, నైపుణ్యం ఈయన సొంతం. తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ పాముల భాస్కర్‌గా గుర్తింపు పొందారు భాస్కర్ నాయుడు. అయితే దురదృష్టవశాత్తూ మరోసారి పాముకాటుకు గురయ్యారు భాస్కర్ నాయుడు.. దీంతో ఆయనను తిరుపతిలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శుక్రవారం కోబ్రా పాము కాటుకు గురయిన భాస్కర్‌ నాయుడు.

తిరుమలలో యాత్రికులు బస చేసే గదులతో పాటు కోదండ రామస్వామి ఆలయం, కపిలతీర్థం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి రుయా ఆస్పత్రితోపాటు ఇతర ప్రదేశాల్లో ఎక్కడ పాము కనిపించినా భాస్కర్ నాయుడుకు వెంటనే సమాచారం అందుతుంది. క్షణాల్లో అక్కడికి చేరుకునే భాస్కర్ నాయుడు చేతికి గ్లౌజులు, ఒంపు తిరిగిన ఓ కడ్డీతో చాకచక్యంగా పామును బంధిస్తారు. ఆ తర్వాత శేషాచలం అడవుల్లోకి తీసుకువెళ్లి ఆ సురక్షితంగా సురక్షితంగా వదిలి వేస్తారు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం విషపూరిత కోబ్రా పాము కాటుకు గురయ్యారు భాస్కర్‌నాయుడు. దీంతో తిరుమలలోని అపోలో ఎమర్జెన్సీ క్లినిక్‌లో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం అమర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో భాస్కర్ నాయుడుకు చికిత్స కొనసాగుతోంది.

Bhaskar Naidu

Bhaskar Naidu

భాస్కర్ నాయుడు గోగర్భం డ్యామ్ సమీపంలోని పార్క్ లో ఉన్న విషపూరితమైన కోబ్రా ను పట్టుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు.. కోబ్రా ను పట్టుకొని బ్యాగులో వేసుకునే సమయంలో భాస్కర్ నాయుడు ఎడమ చేతిని కోబ్రా కాటేసింది. ఎప్పుడు సరదాగా పాములు పట్టుకున్న వెంటనే వాటితో ఆడుకుంటూ తీసుకెళ్లే భాస్కర్ నాయుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పాము కాటేసిన రెండు నిమిషాలకే స్పృహ కోల్పోయాడు.

గతంలోనూ చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్‌నాయుడు

గతంలోనూ పలుమార్లు పాముకాటుకు గురైన భాస్కర్ నాయుడు..చావు అంచుల వరకూ వెళ్లి మృత్యుంజయుడై తిరిగొచ్చారు. 2022 జనవరిలో పామును పట్టేందుకు వెళ్లిన భాస్కర్ నాయుడును పింజర పాము కాటు వేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. ఆ తర్వాత మూడు నెలలకే భాస్కర్ నాయుడు తిరిగి విధుల్లో చేరారు. అయితే మరోసారి పాముకాటుకు గురవడం కలవర పెడుతోంది.

వీడియో చూడండి..

1982లో టీటీడీ అటవీశాఖలో చేరిన భాస్కర్‌నాయుడు

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చారు. 1982లో టీటీడీ అటవీశాఖలో చేరారు. 2005లో తొలిసారిగా తిరుమలలో కొండ చిలువను బంధించారు భాస్కర్ నాయుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వేలాది పాములను బంధించడం, అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేయడం ఆయన విధి. టీటీడీ ఉద్యోగిగా ప‌ని చేస్తూ ఇప్పటికే రిటైరైన‌ప్పటికీ టీటీడీ అధికారులు భాస్కర్ నాయుడు సేవ‌లను కొన‌సాగిస్తున్నారు. భాస్కర్ నాయుడు పాముకాటుకు గురి కావటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

43 ఏళ్లలో 15 వేలకు పైగా పాములు పట్టిన రికార్డు..

టిటిడి అటవీ శాఖలో కార్మికుడిగా చేరిన భాస్కర్ నాయుడు పాములను పట్టే నైపుణ్యమే అతన్ని స్నేక్ క్యాచర్ గా మార్చింది. ఆ తర్వాత 1988 లో టీటీడీ ఫారెస్ట్ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగి అయ్యాడు. అప్పటి నుంచి స్నేక్ క్యాచర్ గా విధులు నిర్వర్తించిన భాస్కర్ నాయుడు 2021 లోనే రిటైర్డ్ అయ్యారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు తరచూ బయటకు వస్తూ భక్తులను భయపెడుతుండడంతో భాస్కర్ నాయుడు సేవలను టిటిడి కొనసాగించింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా టిటిడి అటవీ శాఖలో పాములు పడుతూ వస్తున్న భాస్కర్ నాయుడు 2022 లో పాము కాటుకు గురై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత కోలుకొని తిరిగి పాములు పట్టే పనిలో బిజీ అయ్యాడు. ఇలా తన సర్వీసులో దాదాపు 15 వేలకు పైగా పాములను పట్టిన భాస్కర్ నాయుడు ఇప్పుడు మరోసారి కోబ్రా కాటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..