Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ముగ్గురు మృతి..
ఆరోగ్యం బాగోకపోవడంతో తాయత్తు కట్టించుకునేందుకు బయల్దేరారు. యంత్రం కట్టించుకుని ఇంటికి పయనమైన వారిపై మృత్యువు దూసుకొచ్చింది. లారీ రూపంలో అతి వేగంగా వచ్చిన ప్రమాదం.. ముగ్గురు ప్రాణాలను బలి...
ఆరోగ్యం బాగోకపోవడంతో తాయత్తు కట్టించుకునేందుకు బయల్దేరారు. యంత్రం కట్టించుకుని ఇంటికి పయనమైన వారిపై మృత్యువు దూసుకొచ్చింది. లారీ రూపంలో అతి వేగంగా వచ్చిన ప్రమాదం.. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన దస్తగిరి, సరస్వతి, ప్రేమ్‌కుమార్ లు కొండాపురం మండలం దత్తాపురం వచ్చారు. కొన్ని రోజులుగా సరస్వతికి అనారోగ్యంగా ఉండడంతో తాయత్తు కట్టించుకొని ఆటోలో తిరిగి పయనమయ్యారు. కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో ఆటో ప్రయాణిస్తున్న సమయంలో ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. లారీ అదుపు తప్పడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్‌ను 108 లో ప్రొద్దుటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ మోహన్‌రెడ్డి, ఎస్సై, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షేమంగా ఇంటికి వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న వారు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..