AP Capital: ఏపీ రాజధాని ఆ నగరమే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన ప్రకటన..
ఏపీ రాజధాని విశాఖే. మూడు రాజధానులన్నది మిస్‌కమ్యూనికేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. కర్నూలు, అమరావతిలో న్యాయ, శాసన విభాగాలు మాత్రమే ఉంటాయన్నారు. బెంగళూరులో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఆయన మాట్లాడారు.
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పై ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. విశాఖకు మారిపోతామని.. అక్కడి నుంచే పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఆర్ధికమంత్రి తేల్చి చెప్పడంతో మరోసారి రాజధానుల చర్చ ఏపీలోమొదలవుతోంది. మంగళవారం బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన ఏపీ రాజధాని అంశంపై ప్రకటన చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందన్నారు. ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని స్పష్టం చేశారు. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అని సంకేతాలు తేల్చి చెప్పారు.
ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదన్నారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపీ రాజధానిగా విశాఖే బెస్ట్ అని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందన్నారు. మా ప్రభుత్వ నిర్ణయం కూడా అదే అని తెలిపారు. విశాఖ ఇప్పటికే ఓడరేవు నగరంగా, కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని.. భవిష్యత్‌లోనూ విశాఖ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
కర్నూలు రెండో రాజధాని కాదన్నారు. అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్ ఉంటుందంతే అని వెల్లడించారు. కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్బాలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయని అలాగే ఏపీలోనూ ఉంటాయన్నారు. 1937 శ్రీబాగ్ ఒప్పందంలో.. రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలని పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తాని.. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఓ సెషన్ గుంటూరులో జరుగుతాయన్నారు.
ఇదిలావుంటే, న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నెల 23న మూడు రాజధానుల కేసు సుప్రీంలో విచారణకు రానుంది. సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తుందని జగన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆలస్యం జరిగితే విశాఖ కేంద్రంగా సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే సమయంలో మూడు రాజధానుల వ్యవహారం పై మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు మరో సారి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బెంగుళూరు కేంద్రంగా మంత్రి బుగ్గన విశాఖ ప్రాధాన్యత గురించి వివరించారు. మూడు రాజధానులు అనేదే తప్పుగా వెళ్లిన సందేశంగా పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం