Visakhapatnam: స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్రిక్తత.. అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించిన ఉక్కు కార్మికులు..

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీ....

Visakhapatnam: స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్రిక్తత.. అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించిన ఉక్కు కార్మికులు..
Vizag Steel Plant
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 26, 2022 | 6:57 AM

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజైషన్ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నడుమ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్‌ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మరి కార్మికులు ఎందుకు ముట్టడించారు..? ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రెండేళ్ళుగా నలుగుతోంది. కార్మిక లోకం ఒక్కటిగా గొంతెత్తి ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని నినదిస్తోంది. కానీ వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని, వారు ఎందుకు వచ్చారు?, వారికి ఏమి చెప్పారో…వెల్లడించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏమీ రాలేదని, స్టీల్‌ప్లాంట్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని తెలిపారు.

అయితే.. యాజమాన్యం మాటలు నమ్మని కార్మిక నాయకులు, ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు ప్లాంట్‌ టౌన్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవనం వద్ద ఏం పని అని, ప్లాంట్‌ భూములు పరిశీలన కోసమే వచ్చారా?…అంటూ నిలదీశారు. తొలుత ప్లాంట్‌ టౌన్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవనంలో డైరెక్టర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారని సమాచారం అందడంతో పోరాట కమిటీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. అయితే రూటు మార్చిన అధికారులు వారిని ప్రధాన పరిపాలన భవనం వద్దకు తీసుకువెళ్లారని తెలియడంతో వీరంతా అక్కడకు వెళ్లారు. పరిపాలనా భవనంలోనికి వెళ్లేందుకు కార్మిక నేతలు ప్రయత్నించగా పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు.

ప్లాంట్‌ ఉత్పత్తిని గాలికి వదిలి ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనలో యాజమాన్యం ఉందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .కీలకమైన బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఉత్పత్తి తగ్గించారన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్మికవర్గం చేసే ఆందోళనకు యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్లాంట్‌ ప్రజల ఆస్తి అని, దాని జోలికొస్తే సహించేది లేదన్నారు. ప్లాంట్‌లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చేందుకు యత్నించినా, యాజమాన్యం సహకరించినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..