Nara Lokesh: పాదయాత్రకు సిద్దమైన చినబాబు.. 400 రోజులు 4వేల కిలోమీటర్లు.. అధికారిక ప్రకటన
లోకేష్ పాదయాత్రపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. తన టూర్ షెడ్యూల్ మొత్తం రిలీజ్ చేశారు. అయితే ఇదే విషయంపై రోజా ఏమన్నారో చూద్దాం..
పాదయాత్రపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 27 నుంచి యాత్ర మొదలవుతుందని ప్రకటించారు. మొత్తం 400 రోజులు 4వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. కుప్పం నుంచి మొదలయ్యే పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు జరగనుంది. మంగళగిరిలోనూ 4 రోజులు యాత్ర ఉంటుందని లోకేష్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుమారుడి పాదయాత్ర ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పార్టీ యువనేతలతో సమావేశం నిర్వహించి పాదయాత్రలో లోకేష్ కు అండగా నిలవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు మొదట్లో బస్సుయాత్ర చేపట్టాలనుకున్నారు. కానీ లోకేష్ ప్రజల్లోకి వెళ్లాలంటే పాదయాత్ర మంచిదని భావించారు.
తెలుగు రాజకీయ చరిత్రలోనే లోకేష్ పాదయాత్ర అత్యంత సుదీర్ఘంగా సాగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రికార్డు జగన్ ఖాతాలో ఉంది. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, జగన్ పాదయాత్రలు చేసి ఆ వెంటనే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. అయితే ఇదే విషయంపై రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రి సీఎంగా ఉండగానే మంగళగిరిలో గెలవలేకపోయిన లోకేశ్.. జగన్ కి సవాళ్లు విసరడం విడ్డూరంగా ఉందని అన్నారు మంత్రి రోజా. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పైనా విసుర్లు విసిరారు. ఆయన ఎప్పుడేం మాట్లాడ్తారో ఆయనకు ఎంత మాత్రం తెలీదనీ అన్నారు రోజా. భవిష్యత్తులో పవన్ పార్టీని కనిపించకుండా ప్రజలు తరిమికొడతారని ఎద్దేవా చేశారు.
లోకేష్ తన పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే మంగళగిరి తన కంచుకోటగా మారిందనీ. అయినా సరే తనను ఓడించడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తారనీ ఆరోపించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..