TDP 40 Years: తెలుగు జాతి చరిత్రకు ఓ మలుపు.. 40 ఏళ్ల ప్రస్థానానికి పునాది.. పుట్టుక నుంచి..

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల పాదాల కింద పడి నలుగుతున్న రోజులవి. మాటిమాటికి ముఖ్యమంత్రులను మారుస్తూ, వారిని అవహేళన చేస్తూ, కీలుబొమ్మలుగా ఆడిస్తున్న రోజులవి. తెలువారంటే మద్రాసీలుగా..

TDP 40 Years: తెలుగు జాతి చరిత్రకు ఓ మలుపు.. 40 ఏళ్ల ప్రస్థానానికి పునాది.. పుట్టుక నుంచి..
Tdp Ntr
Follow us
Balu

| Edited By: Sanjay Kasula

Updated on: Mar 29, 2022 | 11:27 AM

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల పాదాల కింద పడి నలుగుతున్న రోజులవి. మాటిమాటికి ముఖ్యమంత్రులను మారుస్తూ, వారిని అవహేళన చేస్తూ, కీలుబొమ్మలుగా ఆడిస్తున్న రోజులవి. తెలువారంటే మద్రాసీలుగా పరిగణిస్తున్న రోజులవి. అంతటా నిస్తేజం. కాంగ్రెస్‌ పాలనపై ఏవగింపు. ఓట్లేసి గెలిపించిన నేతల తీరుపై మండిపాటు. ఏం చేయాలో తెలియని అయోమయం. ఎవరు ఆదుకుంటారో తెలియని గందరగోళం.. గతమెంతో ఘనకీర్తి కలిగిన తెలుగు జాతి వైభవాన్ని కాపాడేదెవరో తెలియని సంధి కాలం. తెలుగు ప్రజల పౌరుష ప్రతాపాలకు పదును పెట్టగల కార్యశూరుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయం. సరిగ్గా అప్పుడు. నేనున్నానంటూ ఓ స్ఫురద్రూపం ముందుకొచ్చింది…నిండైన వ్యక్తిత్వం…నిలువెత్తు తెలుగుతనం వుట్టిపడుతున్న ఆ జగన్మోహనరూపాన్ని చూసి జనం పులకించిపోయింది.. ఖంగున మోగుతున్న ఆ స్వర సందేశాలను విని మైమరచిపోయింది.

1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు షూటింగ్‌ టైమ్‌లో ఓ జర్నలిస్ట్‌ ఎన్టీఆర్‌ని అడిగాడు. త్వరలో మీ షష్టిపూర్తి జరగబోతోంది కదా? మీ జీవితానికి సంబంధించి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకున్నారా అని! దానికి ఎన్టీఆర్‌ నవ్వాడు. నిమ్మకూరనే చిన్న ఊళ్లో పుట్టిన నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్లిన జనానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక్కడినుంచి నెలలో పదిహేనురోజులు షూటింగ్‌కి కేటాయిస్తే పదిహేనురోజులు ప్రజలకోసం కేటాయిస్తాను అని జవాబిచ్చాడు. అదే ప్రజాజీవితంలోకి ఎన్టీఆర్‌ తొలి అడుగు… ఓ రాజకీయ ప్రస్థానానికి అదే అంకురార్పణ.

అది ఏడో దశకం చివరి కాలం… ఆంధ్రప్రదేశ్‌కి రాజకీయంగా ఓ గడ్డుకాలం.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అడుగడుగునా కుమ్ములాటలే! పదవికోసం వెంపర్లాటలే! అధిష్ఠానం దయకోసం ఆరాటాలే! చదరంగంలో పావుల్ని మార్చినట్టు… ఆర్నెల్లకో ముఖ్యమంత్రిని మార్చి తెలుగు ఆత్మగౌరవంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆటలాడుకునే దుర్దినాలవి. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించడం… రాష్ట్రంలో శాసనసభ్యులు ఏదో పేరుకి ఎన్నుకోవడం… అంతే! ఈ చదరంగంతో రాష్ట్ర రాజకీయానికి చెదపట్టింది. కాంగ్రెస్‌ అంటేనే ప్రజలకి రోతపుట్టింది. సరిగ్గా ఆ సమయంలో వెండి తెరమీద నుంచి రాజకీయ యవనిక మీదకు వచ్చాడు నందమూరి తారకరామారావు.

మార్చి 22, 1982. 

హైదరాబాద్‌

రామకృష్ణా సినీ స్టూడియో

ఎన్టీఆర్‌ పత్రికా విలేకరుల సమావేశం.. ఏం చెబుతారోనన్న ఆసక్తి.. ఎప్పటిలాగే సినిమాల గురించి కాసేపు ముచ్చట్లు.. రాజకీయ రంగ ప్రవేశం గురించి ముక్తాయింపు. యువ నామ సంవత్సరం.. చైత్రమాసం…వసంతకాలం. ఓ ఆహ్లాదమైన వాతావరణం.. మూడు రోజుల కిందట ఉగాదిని జరుపుకున్న ప్రజలు తీపి, చేదు జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. రాజకీయ శూన్యతను భర్తి చేయగల ధీరుడెవరని చర్చించుకుంటున్నారు.

మార్చి 28, 1982.

హైదరాబాద్‌, సాయకాలం. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌.. ఎన్టీఆర్‌ అభిమానులతో ఆ ప్రాంగణం సందడిగా ఉంది. తెలుగువారి తెరవేలుపు నందమూరి కోసం ఆనందంగా పడిగాపులు కాస్తున్నారు. పార్టీ ప్రకటన చేస్తారని తెలియడంతో యువత కూడా పెద్ద ఎత్తున వచ్చింది. జనంతో నిండిపోయింది. సమావేశాన్ని లెజిస్లేటర్స్‌ క్లబ్‌లో నిర్వహించాలనుకున్నారు కానీ స్థలం సరిపోదన్న ఉద్దేశంతో లాన్‌లోకి మార్చారు.

నీరెండలో నిగనిగలాడుతున్న ఆ స్ఫూరద్రూపం గంభీరంగా నడుచుకుంటూ వచ్చింది.. కోలాహలం మొదలయ్యింది.. రాజకీయ ప్రవేశం గురించి చెప్పిన ఎన్టీఆర్‌ పార్టీ పేరు కూడా అక్కడే ప్రకటించారు. ఓ అరగంట పాటు ప్రసంగించారు. పార్టీ పేరు తెలుగుదేశం అని అనగానే కేరింతలు, చప్పట్లతో ఆ ప్రాంగణం మారుమోగింది. అలా తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించింది. ప్రాంతీయపార్టీల చరిత్రలోనే ఓ కొత్త శకానికి నాంది పలికింది.

పాత చెవ్రోలెటు వ్యాను చైతన్య రథంగా మారింది. కుమారుడు హరికృష్ణ సారథిగా ముందుకి కదిలింది. చైతన్యరథమే ప్రచార వేదిక. అదే నిత్య నివాసంగా మారిపోయింది. ఆ రథం ఊరువాడా కదలింది.. ఎన్టీయార్‌కు అదే ఉపన్యాసాల వేదికగా మారింది.. తెలుగుదేశం పిలుస్తోంది…రా…కదలిరా అనే నినాదం పల్లెపల్లెనా మారుమోగింది…

చైతన్యరథంపైనుంచే ప్రజలను ఉత్తేజితులను చేస్తూ…ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలిస్తూ ముందుకుసాగాడు నందమూరి…ఎండవానలను లెక్క చేయక… వణికిస్తోన్న చలిని ధిక్కరిస్తూ రాత్రింబవళ్లు ఆరు పదుల వయసులో అలుపెరగకుండా తిరిగాడు ఎన్టీయార్‌… ఖాకీ దుస్తులు ధరించి ఓ కార్మికుడిలా కృషి చేశాడు… ప్రజల అభిమానానికి దాసోహమంటూ అడుగడుగునా ఆగుతూ ఓ కర్మయోగిలా పని చేశాడు.. తల్చుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది… ఒక్కడు అన్నేసి వేల కిలోమీటర్లు ఎలా తిరిగాడాఅని? అవును మరి! ఎన్టీయార్‌ ఒకే ఒక్కడు.. రాష్ట్రచరిత్రలో అలాంటి చైతన్య యాత్ర మరొకటి లేదనిపిస్తుంది.

దశాబ్దాల చరిత్ర ఉన్న జాతీయ పార్టీని.. జస్ట్‌ కొన్ని నెలల వయసున్న పసికందు లాంటి పార్టీ చిత్తు చేసి ఓడించడం చరిత్రలోనే అపూర్వం. ఆ ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. ఎన్టీఆర్‌ ప్రచార ప్రభంజనం కాంగ్రెస్‌ అధికారమదాన్ని మట్టికరిపించింది.కేవలం తొమ్మిదినెలల క్రితం అంకురార్పణ జరిగిన పార్టీ… అధికారపార్టీ అంచనాలకి అందని రీతిలో అపూర్వ విజయం సాధించింది. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం 199 సీట్లు సాధించింది. కాంగ్రెసుకి కేవలం అరవై మాత్రమే దక్కాయి. ఈ విజయం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనే ఓ అద్భుత విజయం. అభిమాన నటుల మీద ఆదరణ కురిపించడం కేవలం తమిళనాడుకే పరిమితం కాదని తెలుగువారు నిరూపించారు. పోటీ చేసింది ఎవరైనా ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకుంటే చాలు సక్సెస్‌ వరించింది. తెలుగుదేశం జెండా రాష్ట్రం నలుమూలలా సగర్వంగా రెపరెపలాడింది.

అఖిలాంధ్రకోటి అభిమానంతో ఎన్టీఆర్‌ని అన్నా అని పిలిచింది. జనవరి 9, 1983. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియం. అశేష జనవాహినితో స్టేడియం నిండిపోయింది. సాక్షాత్తూ శ్రీరాముడికే పట్టాభిషేకం జరుగుతోందా అన్నంత గొప్పగా తారకరాముడి పదవీ స్వీకార ఉత్సవం జరిగింది. ప్రజానాయకుడి పదవీస్వీకారోత్సవం ఎప్పుడూ సంబరమే. అయితే కేవలం ధనబలం, రాజకీయ బలంతో ఎన్ని ఆర్భాటాలు చేసినా ఆ ఉత్సవానికి కళ రాదు. ప్రజల గుండెల్లోంచి సహజంగా పొంగుకొచ్చిన అభిమానం వెల్లువైతే ఎలా ఉంటుందో ఆ టైమ్‌లో రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. స్వచ్ఛమైన తెలుగువాడి అభిమానానికి అంతగా పాత్రుడైన ఎన్టీఆర్‌ ధన్యుడు.

ఎన్టీఆర్‌ సినిమా తెరమీద కథానాయకుడు మాత్రమే కాదు. కొత్తతరం రాజకీయాలకి తెరచాపలెత్తిన ప్రజానాయకుడిగా కూడా విజయం సాధించాడు. ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చాక, తెలుగు వైభవం కోసం ఎంతగానో కృషి చేశాడు. నిర్ణయాలు తీసుకున్న తరవాత ఎంతటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గని పోరాట పటిమ ప్రదర్శించాడు. తెరమీదే కాదు. నిజజీవితంలోనూ తన నాయకత్వ లక్షణాలు నిరూపించాడు. సినిమా హీరోలు కష్టాలు తీరుస్తారు. కానీ అది తెరమీదే! తెరమీంచి ప్రజల్లోకి నడిచి వచ్చి ఆ కలని నిజం చేసిన ఘనుడు ఎన్టీఆర్‌. తెరమీద విష్ణువులా అలవైకుంఠపురంబులో ఆ మూల సౌధంబులో కనిపించాడేమోగానీ రాజకీయానికి వచ్చేసరికి ప్రజాజీవితంలోకి చొచ్చుకుపోయాడు ఎన్టీఆర్‌. పేదవాడి కష్టాలేమిటో తెలిసిన ప్రజానాయకుడిగా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అభివృద్ధిని అంకెల్లో మాత్రమే చూపించే పద్ధతికి స్వస్తి చెప్పి పేదవాడికి అక్షరాలా ఉపయోగపడే పథకాలకి శ్రీకారం చుట్టాడు.

రెండు రూపాయలకి కిలో బియ్యం.. కిలో బియ్యం కేవలం రెండే రూపాయలకి ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? పేదవాడి అవసరం తెలిసిన వాడికి! ఆకలంటే ఏమిటో ఎరిగిన వాడికి! ఓట్ల కోసం వేసే రాజకీయ పథకంలా పుట్టిన ఆలోచన కాదది! పాలకుడి నిర్ణయాలు ప్రజలకి నేరుగా ఉపయోగపడాలన్న ఆదర్శంతో తీసుకున్న నిర్ణయం అది! అందుకే అది జనం లోకి వెళ్లింది. వాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తూనే రావడం ఎన్టీఆర్‌ పట్టుదలకీ ప్రజాసంక్షేమ దృష్టికీ నిదర్శనం.

పేదలకి పూరి గుడిసెలో తాత్కాలిక నివాసాలో ఏర్పరచుకునేందుకు ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేయడం ఆనవాయితీ. అయితే పేదవాడికి పక్కా ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఎన్టీఆర్‌ది! ప్రతి మనిషికీ కూడూ గూడూ గుడ్డా అనే కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత పాలకుడికి ఉందన్న ఆదర్శాన్ని ఎన్టీఆర్‌ నమ్మాడు. అందుకే జనతావస్త్రాల్ని అందుబాటులోకి తెచ్చాడు. తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చీరలూ దోవతుల్ని సామాన్యుడికి చేరువ చేశాడు.ఇవి మాత్రమే కాదు.. ప్రజలకోసం ఎన్నో పథకాలు. ఎన్నో ఆలోచనలు.. ఎన్నో నిర్ణయాలు.. ఎన్టీఆర్‌ ఎక్స్‌ క్లూజివ్‌ పేరుతో లిస్ట్‌ చేస్తే… ఎన్నో కనిపిస్తాయి. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌. మహిళలకి ఆస్తి హక్కు ఉండాలని చట్టం తెచ్చినా… తెలుగుగంగ ప్రాజెక్టులో రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చేందుకు పట్టుబట్టినా.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా ఆ ఘనత ఎన్టీఆర్‌దే. అప్పట్నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశంపార్టీ ఎన్నో ఉత్థానపతనాలను చవి చూసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఎంతో మంది కార్యకర్తలున్నారు.

శిఖరాన్ని అధిరోహించడం వేరు. అధిరోహించిన శిఖరాన్నుంచి అకస్మాత్తుగా జారిపడ్డప్పుడు హతాశుడైపోకుండా తిరిగి పట్టుదలతో శిఖరాగ్రానికి చేరుకోవడం వేరు. నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం అది. 1984 లో నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో తానే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ చర్యకి అప్పటి గవర్నరు రాంలాల్ సహకరించాడు. అయితే ఈ హఠాత్పరిణామానికి రామారావు కుంగిపోలేదు. తిరిగి జనం లోకి వెళ్లాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఉద్యమం సాగించాడు. ఒక్క కాంగ్రెస్‌ చేసిన ఈ కుట్రని వ్యతిరేకించడంలో అన్ని పక్షాలూ ఎన్టీఆర్‌కి మద్దతునిచ్చాయి. సెప్టెంబర్ 16 నాటికి ఎన్టీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించాడు.

అక్కడితో విజయం ఆగిపోలేదు. నాదెండ్ల కుట్ర తరవాత శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి పొందాలనుకున్నాడు ఎన్టీఆర్‌. మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. గతంలో కంటే ఎక్కువగా ఏకంగా 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు. తొమ్మిదినెలల్లో పార్టీపెట్టి 199 సీట్లు సాధించడం ఒక ఘనత అయితే కూలిపోయిందనుకున్న ప్రభుత్వాన్ని అంతకంటే ఘనతరంగా తిరిగి పీఠం ఎక్కించడం మరో ఘనత. పార్టీ గురించి ప్రస్తావిస్తూ అంత ఎన్టీఆర్‌ గురించే చెబుతున్నారేమిటన్న అనుమానం రావచ్చు.. తెలుగుదేశంపార్టీ అంటేనే ఎన్టీఆర్‌ కాబట్టి..

ఎన్టీఆర్‌ సారథ్యంలో టీడీపీ 1989లో మాత్రమే ఓడిపోయింది. 1983, 1985, 1994లలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లూ 200కిపైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలనూ గెలుచుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా 1977 లో అఖండ విజయం సాధించిన జనతా పార్టీ … 1980 మధ్యంతర ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న జనతాపార్టీ కుప్పకూలిపోవడం కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రతిపక్షాలకి పెద్ద దెబ్బ. ఆ సమయంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకం కావడానికి ఓ వేదిక అవసరమయింది.

వారందరినీ ఒక తాటిమీద నడిపించే నాయకత్వం తప్పనిసరి అయింది. అప్పుడు టీడీపీ అధినేత ఎన్టీఆర్‌ సారథిగా బాధ్యత వహించాడు. 1984 లో విజయవాడలో ప్రతిపక్షాల కాన్‌క్లేవ్‌ నిర్వహించినా… 1987 లో నేషనల్‌ ఫ్రంట్‌ స్థాపించినా అది టీడీపీకే చెల్లింది. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అత్యంత కీలక పాత్ర వహించడం ఎన్టీఆర్‌ టీడీపీతోనే మొదలయిందని చెప్పాలి. రాజీవ్‌ బోఫోర్స్‌ కుంభకోణ వివాదంలో ప్రతిపక్ష సభ్యులు… పార్టీలకి అతీతంగా పార్లమెంట్‌ సభ్యత్వానికి 105 మంది మూకుమ్మడి రాజీనామా చేశారు. ప్రతిపక్షాల మధ్య జాతీయ స్థాయిలో ఇంతటి ఐక్యతని తెచ్చింది టీడీపీనే! 1984 ఇందిరహత్య తరవాత పార్లమెంట్‌ ఎలక్షన్లలో దేశమంతగా ఇందిరా సానుభూతి పవనాలు వీచినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ హవాయే నడిచింది. పార్లమెంట్‌లో ఓ ప్రాంతీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కడం కూడా గొప్ప విషయమే!

1995, సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని దింపేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తర్వాత సీఎం అయ్యారు. పార్టీకి అధ్యక్షుడూ అయ్యారు. పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఎన్టీఆర్‌ మరణం తర్వాత టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబే దిక్కయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బాబు సారథ్యంలోని టీడీపీ గెలిచింది. కానీ 2004లో ఓడిపోయింది.. అప్పట్నుంచి టీడీపీకి ఒడిదుడుకులు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ చేతిలో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది. తెలంగాణలో దాదాపుగా పార్టీ కనుమరుగయ్యింది. ఇప్పుడు కాపాడుకోవాల్సింది ఏపీలోనే! నిజంగానే చంద్రబాబుకు ఇది చాలా పెద్ద టాస్క్‌. పార్టీ కేడర్‌లో చంద్రబాబు సమర్థత మీద ఎలాంటి అనునామాలు లేవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమన్న విశ్వాసంతో ఉన్నారు కార్యకర్తలు, నేతలు..

ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..