AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో పరిహారంపై రాజకీయం.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో టీడీపీ, వైసీపీ సరస్పరం విమర్శలకు దిగాయి. తమ ఒత్తిడితోనే ప్రభుత్వం పరిహారం విషయంలో స్పందించిందని వైసీపీ అంటే..జగన్‌ హయాంలో జరిగిన ప్రమాద బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో పరిహారంపై రాజకీయం.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
Tdp Vs Ycp
Ravi Kiran
|

Updated on: Aug 25, 2024 | 9:11 AM

Share

ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో టీడీపీ, వైసీపీ సరస్పరం విమర్శలకు దిగాయి. తమ ఒత్తిడితోనే ప్రభుత్వం పరిహారం విషయంలో స్పందించిందని వైసీపీ అంటే..జగన్‌ హయాంలో జరిగిన ప్రమాద బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలపర్వం కొనసాగుతోంది. నిన్నటి వరకు ఎసైన్షియల్ ఫార్మా కంపెనీలో ప్రమాదానికి బాధ్యత మీదేనంటూ దుమ్మెత్తి పోసుకున్న టీడీపీ, వైసీపీ ఇవాళ బాధితులకు పరిహారం విషయంలో పరస్పర విమర్శలకు దిగాయి. ప్రమాద ఘటనలో బాధితుల కుటుంబాలకు పరిహారం విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ సీఎం జగన్‌ చేసిన ఆరోపించడం తగదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన 17మంది కుటుంబసభ్యులకు, 36మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బులు అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలీమర్స్‌ ప్రమాదంలో 15 మంది మరణించగా.. ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదని అనిత గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని.. లేదంటే తానే స్వయంగా ధర్నా చేస్తానని వైఎస్ జగన్‌ చేసిన ప్రకటనపై అనిత మండిపడ్డారు.

ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ 5లక్షలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున వైసీపీ సాయం ప్రకటించింది. ఈ ఘటనలో మాజీ సీఎం జగన్‌ను హోమంత్రి అనిత టార్గెట్‌ చేయడాన్ని వైసీపీ తప్పుపట్టింది. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల చెక్కులు ఇచ్చిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అచ్యుతాపురం సెజ్ ఘటనలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని బొత్స ఆరోపించారు. బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాతే.. చంద్రబాబు స్పందించారని ఆయన అన్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం ముందో మాట.. తర్వాత ఓ మాట మాట్లాడటంతోనే వైసీపీ అధినేత జగన్ స్పందించారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్ వంటి రక్షణ ప్రమాద నివారణ చర్యలపై దృష్టిపెట్టాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.