Union Budget 2022: కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. చంద్రబాబు పెదవి విరుపు..
Union Budget 2022: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై విపక్ష నేతలు..

Union Budget 2022: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఏపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాధ్ స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదని, వేతన జీవులకు మొండిచేయి చూపారని విమర్శించారు. నదులు అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామని అన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరో సారి వైసీపీ విఫలమైందన్నారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు.
పేదల జీవితాలు చిన్నాభిన్నం: శైలజానాథ్ ఇక కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చూపిందని శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావనే లేవని దుయ్యబట్టారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ.. సామాన్యులను మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇది అని విమర్శించారు జైలజానాథ్. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ రెడ్డి పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రభుత్వం వద్ద వైసీపీ ఎంపీలు మోకరిల్లారని విమర్శించారు. ప్రజలకు మాయ మాటలు చెబుతూ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని ఆర్ధికంగా, సామాజికంగా దారుణమైన స్థితికి నెట్టాయని ఫైర్ అయ్యారు శైలజానాథ్.
Also read:
తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?
Socialmedia: సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్, గుండె జబ్బులు ఖాయం..?
Telugu States MPs Reactions: కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు..!
