TDP Mahanadu 2022: రాని కరెంటుకు బాదుడే బాదుడు.. మహానాడు వేదికగా చంద్రబాబు విమర్శలు..
చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన..
ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడు(Mahanadu) వేదికగా ఆయన మాట్లాడారు. తెలుగుజాతికి ఇది పండుగ అని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) గుర్తు చేశారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఎద్దేవ చేశారు. చేతకాని దద్దమ్మ జగన్(CM Jagan) వల్ల రాష్ట్రం పరువు పోతోందని విమర్శించారు. అయితే గత 40 ఏళ్లలో టీడీపీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు మరో ఎత్తని చంద్రబాబు అన్నారు. తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. వైసీపీ(YCP) తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపైనే తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతామన్నారు. ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని.. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు పోయిందని చంద్రబాబు ఆరోపించారు. పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదని విమర్శించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్ అన్నీ పెంచేశారని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కొనసాగుతోందని విమర్శించారు.
మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి వేసే పరిస్థితి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుందని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరని.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. దానితోనే వసూలు మొదలు పెట్టారని ఎద్దేవ చేశారు. టీడీపీ హయాంలో పెట్టిన అన్నా క్యాంటీన్ తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి పథకాలన్నీ ఏమయ్యాయి? ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు టీడీపీ హయాంలో ప్రత్యేక ప్రణాళిక తెచ్చామని.. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాంమని గుర్తు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..