తిరుమలలో పూజలకు దేశీ ఆవు పాలే వాడాలంటూ పిటిషన్… సుప్రీం కోర్టు ఏమన్నదంటే?
తిరుమల ఆలయంలో పూజలకు స్వదేశీ గోవుల పాలు మాత్రమే వాడాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. "దేవుడికి నిజమైన భక్తి అంటే ఇతరులకు సేవ చేయడంలో ఉంటుంది" అని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. చివరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ కోర్టు అనుమతి తీసుకున్నాడు .

సుప్రీంకోర్టులో దాఖలయ్యే కొన్ని పిటిషన్లు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ఓ పిటిషన్ ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తులను ఆకర్షించింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలకు ఉపయోగించే పాలు స్వదేశీ గోవుల నుంచి మాత్రమే సేకరించాలని, ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. యుగ తులసి ఫౌండేషన్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చే ముందు కీలక వ్యాఖ్యలు చేసింది. చివరకు పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు.
“ఇంతకంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. దేవుని పట్ల నిజమైన భక్తిని సాటి జీవులకు చేసే సేవలో ఉంటుంది, ఇలాంటి విషయాల్లో కాదు” అని జస్టిస్ సుందరేష్ పిటిషనర్ తరఫు న్యాయవాదితో విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆలయ ఆచారాలపై కొత్త చర్చను రేకెత్తించాయి. “గోవు అంటే గోవే” అని వ్యాఖ్యానిస్తూ, ఆగమశాస్త్రాల ప్రకారం గోవుల్లో తేడా ఉందన్న వాదనను తోసిపుచ్చారు. “భాష, మతం, కులం, సమాజం, రాష్ట్రం ఆధారంగా మనుషుల్లో వర్గీకరణ చేస్తున్నాం, కానీ దేవుడు అందరికీ ఒకటే” అని ఆయన అన్నారు.
ఆగమశాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించాలని, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన తీర్మానం, ఆదేశాన్ని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని వాదించారు. టీటీడీ నుంచి సమాధానం పొందేందుకు నోటీసు జారీ చేయాలని కోరారు. దీనికి జస్టిస్ సుందరేష్, “ఏ ఆచారమైనా దేవుని పట్ల మీ భక్తిని సూచిస్తుంది, అంతకు మించి ఏమీ కాదు” అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టపరమైన ఆదేశం ఉందా అని ప్రశ్నించగా, రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన రెండు తీర్పులపై ఆధారపడినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
“ఇప్పుడు మీరు తిరుపతి లడ్డూ కూడా స్వదేశీదే అయి ఉండాలని అంటారు” అని జస్టిస్ సుందరేష్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించారు. చివరగా కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి నిరాకరిస్తుందని తెలపగా, పిటిషనర్ దానిని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛతో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. మొత్తంగా ఈ తీర్పు ఆలయ ఆచారాలు, స్వదేశీ గోవులపై చర్చను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.




