విద్యార్థి కెరీర్ లో పరీక్షలు చాలా ప్రధానమైనవి.అందుకే ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షలలో తప్పకూడదని దాదాపుగా ప్రతి విద్యార్థి తమ వంతు కృషి చేస్తారు. పరీక్ష రాశాక వచ్చే ఫలితాలు మాట ఎలా ఉన్నా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతటి కష్టమొచ్చినా వాటిని ఎదుర్కొని పరీక్ష రాసేందుకే ఆసక్తి చూపిస్తారు చాలామంది విద్యార్థులు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోను పరీక్ష కేంద్రానికి హాజరై ఎగ్జామ్స్ రాసిన చాలామంది విద్యార్థులను గతంలో పలు సందర్భాలలో చూశాం. వారి గురించి విని ఇన్స్పైర్ అయిన సందర్భాలను చూశాం.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన వేల శ్రీకాకుళం జిల్లాలో తొలిరోజు అలాంటి ఘటనే అందరిని ఆకట్టుకుంది. జిల్లాలోని నరసన్నపేటలో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదంలో ఎడమ కాలు విరిగిపోగా బ్యాండేజ్ తోనే పరీక్ష రాసేందుకు తరలివచ్చాడు. నరసన్నపేటలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ రావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో పరీక్ష రాసేందుకు ఎగ్జామినేషన్ సెంటర్ కి వచ్చాడు ఆ విద్యార్థి.
ఈ క్రమంలో విద్యార్థి పరిస్థితిని చూసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పరీక్షా కేంద్రానికి విద్యార్థిని మోసుకువెల్లేoదుకు పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలిస్ కానిస్టేబుల్ కుటుంబసభ్యులకు సహకరించాడు. ప్రమాదంలో గాయపడి విద్యార్థి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ పరీక్ష రాయాలన్న పట్టుదలతోనే అతనిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ సీన్ చూసినవారు విద్యార్థి చిత్తశుద్ధిని కొనియాడారు. ఇంత కష్టంలోనూ పరిక్షరాసేందుకు వచ్చిన విద్యార్థి పరీక్షలలో తప్పనిసరిగా పాస్ కావాలని కోరుకున్నారు. కొందరైతే విద్యార్థికి వీల్ చైర్ ఏర్పాటు చేయటం, గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించటం చేస్తే బాగుణ్ణు కదా అంటూ గుసగుసలాడుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..