Everest: ఎవరెస్ట్ ఎక్కిన ఏపీ విద్యార్థులు.. ఆ ఘనత సాధించిన తొలి బృందం ఇదే..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ బృదం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం సాధారణమే కదా.. అయితే వీరు సాధించిన ఆ ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఎవరెస్ట్ శిఖరాన్ని చాలామంది అధిరోహిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన వారు, మహిళలు, పురుషులు ఇలా అనేక మంది ప్రయత్నిస్తూ శిఖరం అంచుకు చేరుకుంటున్నారు. అయితే కొంతమంది తొలి ప్రయత్నంలో విఫలమయితే మరికొంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించిన లక్ష్యానికి చేరుకోవడం లేదు. అయితే చక్కని ప్రణాళిక, సరైన గైడెన్స్ ఉంటే తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ను అలవోకగా అధిరోహించవచ్చిన ఆ యువ బ్రుందం నిరూపించింది. ఎవరెస్ట్ పై తమ యూనివర్సిటీ జెండాను సగర్వంగా ప్రతిష్టించింది.
అమరావతి రాజధానిలోని ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీకి చెందిన పద్దెనిమిది మంది విద్యార్ధులు బ్రుందం ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ ప్రవేటు యూనివర్సిటికీ చెందిన విద్యార్ధులు ఎవరెస్ట్ ఎక్కిన దాఖలాలు లేవన్న విషయం కూడా వారికి తెలిసింది. దీంతో తమ యూనివర్సిటీ పేరు ఎవరెస్ట్ పై లిఖించాలని వారంతా సిద్దమయ్యారు. యూనివర్సిటీలో బిటెక్ ధర్డ్ ఇయర్ చదువుతున్న గుంటూరుకు చెందిన చందన, సిద్దార్ధ త్రిపాఠి నాయకత్వంలోని బృందం మొదట గన్నవరం విమానాశ్రయం నుండి అక్టోబర్ 11న బయలు దేరిన టీం అక్టోబర్ 20వే తేదీన అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు.
5600 అడుగుల ఎత్తున్న శిఖరాన్ని చేరుకోవడానికి 134 కిలోమీటర్ల మేర నడక సాగించారు. మొదట సులభంగానే శిఖరం అంచుకు చేరుకోవచ్చని భావించామని అయితే ప్రయాణంలో చాలా సమస్యలు, కష్టాలు పడ్డామని చందన చెప్పారు. చలిని తట్టుకోవడం అంత సులభం కాదన్నారు. అదే విధంగా సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకుంటున్న సమయంలో శ్వాస ఆడకపోవడం లాంటి అరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. అయితే దృఢ సంకల్పంతో పట్టువదలకుండా తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ఎక్కాలన్న లక్ష్యాన్ని సాధించినట్లు ఆమె తెలిపారు. విజయవంతంగా తమ లక్ష్యాన్ని చేరుకున్న యువ బృందాన్ని యూనివర్సిటీ అధ్యాపకులతో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..