కొడుకు ఉన్నా.. కూతురే ఆ పని చేయాల్సి వచ్చింది.. ఆస్తి లేని ఓ తండ్రి కన్నీటి గాధ
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పొన్నగల్లులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు మృతి చెందినా అంత్యక్రియలకు కన్నకొడుకు రాకపోవడంతో పెద్ద కుమార్తె నాగరత్నం అన్ని తానై తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తల్లి 15 ఏళ్ల క్రితమే మృతి చెందగా.. తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలోనూ నాగరత్నమే ఆయనకు అండగా నిలిచింది.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తిపాస్తులేవీ సంపాదించి పెట్టని తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కొడుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొడుకు స్థానంలో తల కొరివి పెట్టే బాధ్యత కూతురు నెరవేర్చింది. వివరాల్లోకెళ్తే కార్వేటినగరం మండలం పొన్నగల్లులో ఈ ఘటన జరిగింది. పొన్నగల్లు గ్రామానికి చెందిన శాంతమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ముగ్గురు సంతానం.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ముగ్గురికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పెళ్లి అయ్యాక కొడుకు మురళీ కృష్ణ బతుకు తెరువు కోసం చెన్నైకి వెళ్ళిపోయాడు.
కాగా.. 15 ఏళ్ల క్రితం తల్లి శాంతమ్మ మృతి చెందింది. ఒంటరి జీవితంలో.. గత కొద్దికాలంగా తండ్రి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. కొడుకు గ్రామంలో అందుబాటులో లేకపోవడం వల్ల తండ్రి వెంకటేశ్వర్లును పట్టించుకునే వారు లేకపోయారు. దీంతో పెళ్ళై భర్త చనిపోయిన పెద్దకూతురు నాగరత్నం తండ్రి అలనా పాలనా చూడాల్సి వచ్చింది.
ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకటేశ్వర్లను ఆసుపత్రిలో చూపించారు. ఈ క్రమంలోనే.. ఆరోగ్యం క్షిణించడంతో వెంకటేశ్వర్లు మంగళవారం మృతి చెందాడు. తండ్రి వెంకటేశ్వర్లు చనిపోయినట్లు చెన్నైలో ఉన్న మురళి కృష్ణకు గ్రామస్తులు, బంధువులు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి వచ్చి తండ్రి మృతదేహనికి అంత్యక్రియలు చేయాల్సిన కన్న కొడుకు మురళీకృష్ణ రాలేదు.. దీంతో వెంకటేశ్వర్లు మృతదేహానికి కొరివి పెట్టడానికి కొడుకు అందుబాటులో లేకపోయాడు.
వీడియో చూడండి..
దీంతో పెద్ద కూతురు నాగరత్నం తండ్రి వెంకటేశ్వర్లు అంతిమ సంస్కారాలు కూడా చేయాల్సి వచ్చింది. ఎలాంటి ఆస్తి ఇవ్వలేక పోయిన తండ్రి అంత్యక్రియలకు కొడుకు దూరంగా ఉండటంతో కూతురు నాగరత్నం అన్ని తానై తల కొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది. జన్మనిచ్చిన కన్నకొడుకు.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించకపోవడం, వచ్చేందుకు నిరాకరించడం ఏంటంటూ జనం పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
