AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల వెళ్తున్నారా..? మాంగళ్య పూజ చేయిస్తామంటారు.. నమ్మారో..

తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన 52 ఏళ్ల మురుగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగి, చెన్నై ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని భక్తులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. మాంగళ్య పూజ పేరుతోనూ భక్తులను మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Tirumala: తిరుమల వెళ్తున్నారా..? మాంగళ్య పూజ చేయిస్తామంటారు.. నమ్మారో..
Mangalya Puja Scam
Raju M P R
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 12:02 PM

Share

తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న మరో వ్యక్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన మురుగన్ అరెస్టుతో అతడి మోసాల చిట్టా బయటపడింది. మధురైకి చెందిన 52 ఏళ్ల మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావును తిరుమలలోని రాంభగీచ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మురుగన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. భక్తులను మోసం చేసేందుకు నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

నకిలీ టీటీడీ, ఎయిర్‌పోర్ట్ ఐడీ కార్డులు

తిరుమలకు వచ్చే భక్తులను నమ్మించేందుకు మురుగన్ నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డును తయారు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేందుకు నకిలీ ఎయిర్‌పోర్ట్ సంస్థ గుర్తింపు కార్డును కూడా తయారు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ వద్ద నుంచి నకిలీ టీటీడీ ఎంప్లాయీ ఐడీ కార్డు, చెన్నై ఎయిర్‌పోర్ట్ ఐడీ కార్డు, రెండు సెల్‌ఫోన్లు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాంగళ్య పూజ పేరుతోనూ మోసాలు

అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని వారి బంగారు ఆభరణాలు, నగదును కాజేసేందుకు మురుగన్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మాంగళ్య పూజ పేరుతో భక్తులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. మురుగన్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాంగళ్య పూజ పేరుతో మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మురుగన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అతడి నేర చరిత్ర, నకిలీ గుర్తింపు కార్డుల తయారీతో పాటు ఇతర నేరాలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భక్తులు అప్రమత్తంగా ఉండాలి

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు దళారులు, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ గుర్తింపు కార్డులు చూపిస్తూ నమ్మించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే తిరుమల పోలీసు లేదా విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

Follow Us