Watch Video: సారూ.. మా సమస్య తీరాలంటే మీరు రావాల్సిందే.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆరేళ్ల బుడతడు.. వీడియో
Chittoor district: ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ చాలామంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ బుడతడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Chittoor district: ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వాహనాలు పెరగడం, కొందరి నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే.. ఇటీవల ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ చాలామంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ బుడతడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. యూకేజీ చదువుతున్న ఆరేళ్లు ఈ బుడ్డోడు తనకు ఎదురైన సంఘటన గురించి పోలీస్ స్టేషన్ మెట్లక్కాడు. తమ స్కూల్ దగ్గర రోడ్డు తవ్వి ట్రాక్టర్లను అడ్డు పెట్టారని.. తమందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని మీరు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు (Palamaneru) లో జరిగింది. తమ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి అంటూ శనివారం యూకేజీ చదువుతున్న ఆరేళ్ల కార్తికేయ పలమనేరు సీఐ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.
పలమనేరు పట్టణం ఆదర్శ ప్రైవేట్ స్కూల్ నందు యూకేజీ చదువుతున్న కార్తికేయ.. తమ స్కూలు దగ్గర జెసీబీతో రోడ్డు తవ్వేసి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారని సీఐ భాస్కర్‌కు సమస్యను వివరించాడు. దీంతో అందరూ ఇబ్బంది పడుతున్నారని.. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేయాలంటూ కోరాడు. అయితే.. బుడ్డోడి చురుకుదనం చూసి ఆశ్చర్యపోయిన సీఐ భాస్కర్ ఎస్సైలు నాగరాజు, సుబ్బారెడ్డి బాలుడితో సరదాగా కాసేపు ముచ్చటించారు. తామంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తామని బాలుడికి సీఐ భాస్కర్ హామీనిచ్చారు. ఈ సందర్భంగా సీఐ బాలుడికి స్వీట్ తినిపించి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించారు. ఇబ్బందులుంటే ఫోన్ చేసి చెబుతానంటూ కార్తికేయ పోలీసులతో పేర్కొన్నాడు. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడు ప్రశ్నించిన విధానం.. పోలీసులతో ముచ్చటించిన తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది.
Also Read: