తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు.. రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు.. హైయెస్ట్ రిపోర్ట్ చూస్తే మంటలే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. బయటకొచ్చారా.. మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు సూర్యుడు. ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోళ్లు, రాళ్లు పగిలే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. రానున్న వారం రోజులపాటు ఇలానే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే ఇళ్ల నుంచిబయటకు రావొద్దని సూచిస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతుందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.
పిడుగురాళ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపిందని పేర్కొన్నారు.
రానున్న 5 రోజులు తెలంగాణలో నిప్పుల వర్షమే! – ఏడూళ్ల బయ్యారంలో 46.2డిగ్రీలు
తెలంగాణలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి.. ఖమ్మం జిల్లా ఏడూళ్ల బయ్యారంలో 46.2 డిగ్రీలు, రామగుండంలో 44.6, నిజామాబాద్‌లో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రానున్న 5 రోజులు తెలంగాణలో నిప్పుల వర్షమేనని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఏపీ డిజాస్టర్ మేనెజ్‌మెంట్ హెచ్చరికలు
అలాగే శుక్రవారం(22-05-2026) 15 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు : ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
రాబోవు రెండు రోజులు క్రింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు
☀️ మే 22 శుక్రవారం
• అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• కాకినాడ,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀️ మే 23 శనివారం
• పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• కాకినాడ,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకాళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
గురువారం పల్నాడు(జి) పిడుగురాళ్లలో 48.1డిగ్రీలు, బాపట్ల(జి) వేటపాలెం, కృష్ణా(జి) నందివాడ 47.6, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడు, ప్రకాశం(జి) అద్దంకిలో 47.4, ఏలూరు(జి) అల్లిపల్లిలో 47.3, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 46.6, పోలవరం(జి) కూనవరంలో 46.5, నెల్లూరు(జి) కావలిలో 46.4, గుంటూరు(జి) తెనాలిలో 46, తూర్పుగోదావరి(జి) బ్రహ్మణగూడెంలో 45.8, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 45.5, విశాఖ(జి) ములగాడలో 45.2, అనకాపల్లి(జి) మాకవరపాలెం, కోనసీమ(జి) రామచంద్రాపురం, తిరుపతి(జి) బోనుపల్లెలో 45.1, కాకినాడ(జి) కందరాడ, విజయనగరం(జి) గుర్లలో 45 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, పోలవరం, నెల్లూరు రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.
