AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ.. వ్యతిరేకిస్తూ డైరక్టర్ల తీర్మానం… హైకోర్టును అశ్రయిస్తామన్న కొత్త చైర్మన్‌!

గుంటూరు జిల్లా సంగం డెయిరీ కంపెనీగా ఏర్పడింది. దీని కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని సంగం డైయిరీ పాలక మండలి తీర్మానం చేసింది.

Sangam Dairy:  ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ.. వ్యతిరేకిస్తూ డైరక్టర్ల తీర్మానం... హైకోర్టును అశ్రయిస్తామన్న కొత్త చైర్మన్‌!
Guntur Sangam Dairy
Balaraju Goud
|

Updated on: Apr 28, 2021 | 9:17 AM

Share

Sangam Dairy Issue: గుంటూరు జిల్లా సంగం డెయిరీ కంపెనీగా ఏర్పడింది. దీని కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని సంగం డైయిరీ పాలక మండలి తీర్మానం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగం డెయిరీకి కొత్త చైర్మన్‌గా నర్రా వెంకట కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. మంగళవారం రాత్రి గంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో సంగం డెయిరీ డైరెక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగం డెయిరీ తాత్కాలిక ఛైర్మన్‌గా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్‌ను సంస్థ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డెయిరీ 14 మంది సభ్యుల్లో ఒకరు కొవిడ్‌ బారిన పడటంతో 13 మంది హాజరయ్యారు.

అనంతరం నర్రా వెంకటకృష్ణ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంగం డెయిరీ కంపెనీగా ఏర్పడింది. దీని కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 19ని వెంటనే రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గతంలో డెయిరీ టర్నోవర్‌ రూ.250 కోట్లు ఉండేది. ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర బాధ్యతలు చేపట్టాక అది రూ.1,100 కోట్లకు చేరుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ను ప్రోత్సహించేందుకు ‘సంగం’పై ఏసీబీ అధికారుల చేత దాడులు చేయించి, ఛైర్మన్‌ ధూళిపాళ్లను అక్రమంగా అరెస్టు చేయించిందని ఆయన ఆరోపించారు. డెయిరీని కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామని వెంకటకృష్ణ ప్రసాద్‌ స్పష్టంచేశారు.

మరోవైపు, ఇప్పటి వరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్‌లో వున్నారు. దీంతో వెంకట కృష్ణప్రసాద్‌ను కొత్త చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు డెయిరీ డైరెక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ధూళిపూడి పాల సొసైటీ అధ్యక్షుడిగా నర్రా వెంకట కృష్ణప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అంతకుముందు సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం, డెయిరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది….

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులను ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డెయిరీ నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు అప్పగించింది.1978 జులై 17న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. నిత్యావసరాల సరఫరా, డెయిరీ ఆస్తుల రక్షణకు 3 నెలల కాలానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాల ఉత్పత్తిదారులు, డెయిరీ ఉద్యోగులు, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు, డెయిరీ ఆస్తుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో డెయిరీ ఆస్తులను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 515ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

అయితే, పాడి రైతుల నుంచి పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ తదితర డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులతో నిర్వహించేందుకు పర్యవేక్షణ బాధ్యతను తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు అప్పగించింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా ఆయనకు కట్టబెట్టింది.

ఇదిలావుంటే, ప్రభుత్వం గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి ఇచ్చిన భూముల నుంచి 10 ఎకరాల భూమిని తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరిట ఉన్న ట్రస్టుకు అక్రమంగా ధూళిపాళ్ల నరేంద్ర బదలాయించినట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత ట్రస్టీ కమ్‌ ఎండీగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తనకు తానుగా ప్రకటించుకున్నారని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పేరున ఉన్న ఆస్తులను తనఖా పెట్టి నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నుంచి రూ.115 కోట్లను నరేంద్ర రుణాలుగా పొందినట్టు తెలిపింది. పశు ప్రదర్శనలు, విద్య, శిక్షణ కార్యక్రమాల కోసం బదలాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Read Also…  Hospital Fire: థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు రోగుల సజీవ దహనం.. పలువురికి తీవ్ర గాయాలు