AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే..

పెరిగిన బంగారం ధరలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. విభిన్న మార్గాల్లో అందినకాడికి దోచుకెళ్తున్నారు. పది గ్రాముల బంగారం ధర ఒక్కసారే లక్ష రూపాయలు కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దోపిడి దొంగలు కూడా అదే బంగారాన్ని కాజేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

Andhra: కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే..
Telugu News
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 23, 2025 | 1:29 PM

Share

పెరిగిన బంగారం ధరలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. విభిన్న మార్గాల్లో అందినకాడికి దోచుకెళ్తున్నారు. పది గ్రాముల బంగారం ధర ఒక్కసారే లక్ష రూపాయలు కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దోపిడి దొంగలు కూడా అదే బంగారాన్ని కాజేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపుతుంది. గజపతినగరం మండలం పురిటిపెంట, బాలాజీ నగర్ కాలనీలో పొట్టా గణేష్, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. గణేష్ సీజనల్‌గా అప్పడాల వ్యాపారం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఉదయం గణేష్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. అది గమనించి కొద్దిసేపటి తర్వాత కాషాయి వస్త్రాలతో ఇద్దరు వ్యక్తులు గణేష్ ఇంటి ముందుకు వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని స్వామివారి హుండీలో వేసేందుకు ఎంతో కొంత డబ్బు చందాగా ఇవ్వాలని లలితను కోరారు.

వెంటనే ఆమె ఇరవై రూపాయలు ఇచ్చింది. అనంతరం తమకు కొంచెం మంచినీళ్లు కావాలని లలితను అడిగారు. దీంతో మంచినీటి కోసం లలిత ఇంట్లోకి వెళ్ళింది. అలా వెళ్లిన లలిత వెంట దుండగులు కూడా ఇంట్లోకి ప్రవేశించి ఆమె ముఖంపై స్ప్రే చల్లారు. దీంతో మైకంలోకి వెళ్లిపోయిన లలిత దుండగులు ఏది చెప్తే అది చేయడం మొదలు పెట్టింది. వెంటనే ఇద్దరు దుండగులు లలితను తన వద్ద ఉన్న బంగారం ఇవ్వమని అడిగారు. లలిత తన వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేసింది. అంతేకాకుండా బీరువాలో ఉన్న బంగారంతో పాటు ఐదు లక్షల వరకు నగదు కూడా దుండగులకు ఇచ్చి అనంతరం స్పృహ కోల్పోయింది. అలా దుండగులు అందినకాడికి దోచుకుని పరారయ్యారు.

సాయంత్రం భర్త గణేష్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్య స్పృహ కోల్పోయి నేలపై పడి కనిపించింది. వెంటనే భార్యకు సపర్యలు చేసి స్పృహలోకి వచ్చిన తరువాత జరిగిన విషయం తెలుసుకున్నాడు. సమాచారం ఇవ్వడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అయితే బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలు కూడా వివిధ మార్గాల్లో దోపిడీకి ప్రయత్నిస్తున్నారని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒంటిపై విలువైన బంగారం వేసుకొని వెళ్ళటం శ్రేయస్కరం కాదని, అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.