Andhra Pradesh: ఏపీలోని రైతులందరికీ ప్రభుత్వం శుభవార్త.. రేపట్నుంచే కొత్త కార్యక్రమం.. అవి పూర్తిగా ఫ్రీ..
ఏపీలోని రైతులు ఎగిరి గంతేసే వార్త. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెడీ అయింది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఎప్పటినుంచంటే..?

కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతులకు ఉపయోగపడేలా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించాలని నిర్ణయించింది. గతంలోనే దీనికి సంబంధించి నమూనాలను విడుదల చేయగా.. ఎప్పటినుంచి కొత్తవి పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఏపీలోని రైతులకు కొత్త పట్టదారు పాసు పుస్తకాల పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందుకు ముహూర్తం కూడా అయింది.
జనవరి 2 నుంచి పంపిణీ
జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారులు రైతులకు పుస్తకాలు అందిస్తారని, నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తారని తెలిపారు. జనవరి 9వ తేదీలోపు రైతులందరికీ అందించనున్నట్లు చెప్పారు. ఉచితంగా కొత్త వాటిని అందిస్తామని, ఇందుకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. భూముల రీసర్వే పూర్తైన గ్రామాల్లో కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
21.8 లక్షల పుస్తకాలు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 21.8 లక్షల పట్టదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మార్వో కార్యాలయాలకు ఇవి చేరగా.. రేపట్నుంచి సిబ్బంది ఇంటింటికి వెళ్లి రైతులకు ఇవ్వనున్నారు. ఈ పాసుపుస్తకంపై కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండనుంది. ఇక పోలం విస్తీర్ణం, సర్వే నెంబర్లు లాంటి వివరాలు ఉండనున్నాయి. గత ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే నిర్వహించింది. అనంతరం అప్పటి సీఎం జగన్ ఫొటోతో పాటు క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు అందించింది. అయితే వాటిపై జగన్ ఫొటో ఉండటంపై అప్పట్లో విమర్శలు రాగా.. తాము వస్తే కొత్తవి ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఇప్పుడు పంపిణీకి సిద్దమయ్యారు.
